మళ్లీ గండం..! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ గండం..!

Jun 7 2026 7:01 AM | Updated on Jun 7 2026 7:01 AM

4.84 లక్షల టన్నుల దిగుబడి అంచనా ఫ్యాక్టరీల లక్ష్యం 3.60 లక్షల టన్నులే గతేడాది పల్ప్‌ నిల్వలు, అప్పుల భారంతో ఫ్యాక్టరీలు కుదేలు ధర్మపురిలో కిలో రూ.6లకే కొనుగోళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

తోతాపురికి

జిల్లాలోని మామిడి రైతులపై మరోసారి సంక్షోభ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తోతాపురి కాయలను కొనుగోలు చేయడానికి పల్ప్‌ పరిశ్రమలు ముందుకు రావడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. చెట్లలో కాయలు మంచి సైజుకు వచ్చినా కొనుగోలుదారులు లేకపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఏడాది కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లా వ్యాప్తంగా 59,326 హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ఈ ఏడాది 6,21,252 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో పల్ప్‌ తయారీకి వినియోగించే కాదర్‌ రకం 2,702 హెక్టార్లలో సాగవుతుండగా 18,834 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. తోతాపురి రకం 40,024 హెక్టార్లలో ఉండగా 4,83,981 మెట్రిక్‌ టన్ను ల దిగుబడి వస్తుందని అధికారిక లెక్కలు చెబుతుండగా తోటల్లో కాయల సైజు, దిగుబడి స్థాయిని బట్టి 6 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుకుంటుందని రైతులు పేర్కొంటున్నారు.

అప్పుల ఊబిలో పరిశ్రమలు

బ్యాంకు రుణాలు, వ్యాపార నష్టాలు, నిలిచిపోయిన ఎగుమతుల కారణంగా పలు ఫ్యాక్టరీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈ క్రమంలో ఈ సారి పెద్దఎత్తున కొనుగోళ్లు చేపట్టే పరిస్థితి లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. గతేడాది కొనుగోలు చేసిన మామిడి కాయలకు ఇప్పటికీ బిల్లులు ఇవ్వలేదు. పాత బకాయిలు చెల్లించకుండానే కొత్త సీజన్‌ ప్రారంభం కావడం రైతుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.

తెరుచుకోని ఫ్యాక్టరీలు

ఇప్పటికే తోతాపురి కోతలు వేగం పుంజుకున్నాయి. ఫ్యాక్టరీలు ఇంకా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభించలేదు. కొన్ని యూనిట్లు పరిమిత స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నాయి. దీంతో కాయలు తోటల్లోనే నిలిచిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కాయలు చెట్ల పైనే కుళ్లిపోతున్నాయి. వెంటనే కోసి విక్రయిస్తే కొంత ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు.

క్రిష్ణగిరి ఫ్యాక్టరీలపై ఆశలు

జిల్లా రైతులు ప్రత్యామ్నాయంగా తమిళనాడులోని క్రిష్ణగిరి ఫ్యాక్టరీపై ఆశలు పెట్టుకున్నారు. అక్కడి పల్ప్‌ ఫ్యాక్టరీలు ప్రస్తుతం కిలో తోతాపురిని రూ.6లకే కొనుగోలు చేస్తున్నాయి. ఈ ధర ప్రభావం చిత్తూరు జిల్లా లోని ఫ్యాక్టరీల కొనుగోళ్లపై పడుతోంది. మరోవైపు పల్ప్‌కు అంతర్జాతీయంగా కొత్త ఆర్డర్లు రావడం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిలో ప్రభుత్వం, అధికారులు జోక్యం చేసుకుని ఫ్యాక్టరీలతో సమీక్షించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

లక్ష్యాలకు.. దిగుబడికి కుదరని పొంతన

జిల్లాలో 35 పల్ప్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిలో 25 సింగిల్‌ లైన్‌, 10 డబుల్‌ లైన్‌ యూనిట్లు ఉన్నాయి. ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని బట్టి ఒక్కో యూనిట్‌కు వెయ్యి నుంచి 60 వేల మెట్రిక్‌ టన్నుల వరకు మామిడి కాయలు కొనుగోలు చేయాలని ఉద్యానశాఖ లక్ష్యాలు నిర్దేశించింది. ఈ లెక్కన 3.60 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు లక్ష్యాన్ని కేటాయించారు. తోతాపురి దిగుబడి 4.84 లక్షల మెట్రిక్‌ టన్నులు వస్తుందని అంచనా వేస్తుండగా, కొనుగోలు లక్ష్యం 3.60 లక్షల టన్నులకే పరిమితం కావడంతో మిగిలిన కాయలను ఏమి చేయాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆర్డర్లు రావడంలేదు

క్రిష్ణగిరి ఫ్యాక్టరీలు రూ.6లకు కొనుగోలు చేస్తున్నాయి. చిత్తూరులో రూ.7లకే కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. ఈ ధరలు ఫ్యాక్టరీలపై ప్రభావం పడుతోంది. ఆర్డర్లు కూడా రావడంలేదు. అందువల్లే చాలా ఫ్యాక్టరీలు తెరుచుకోవడం లేదు. ప్రస్తుతం తెరుచుకున్న ఫ్యాక్టరీలపై రైతులు వందలాది మంది వచ్చి పడిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి.. క్రిష్ణగిరి ధరకు.. చిత్తూరు ధరకు ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తే బాగుటుంది. – రఘురాం చౌదరి, జిల్లా పళ్లగుజ్జు పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు, చిత్తూరు

Advertisement
 
Advertisement
Advertisement