తూతూమంత్రం | - | Sakshi
Sakshi News home page

తూతూమంత్రం

Jun 7 2026 7:01 AM | Updated on Jun 7 2026 7:01 AM

హాజరుకాని తిరుపతి, అన్నమయ్య జిల్లాల అధికారులు

వివిధ అంశాలపై నామమాత్రపు చర్చ

కోరం లేక 4వ కమిటీ వాయిదా

సకాలంలో వ్యవసాయ సర్వీసులు ఇవ్వరా?

జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు ఆగ్రహం

చిత్తూరు కార్పొరేషన్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులను సకాలంలో మంజూరు చేయడం లేదని జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు విద్యుత్‌ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ సమావేశపు హాలులో శనివారం జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేసి సకాలంలో రైతులకు ఇవ్వకపోతే పంటలకు నీరు ఎలా పెడతారని నిలదీశారు. ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, రెండు రోజులు నీరు పెట్టకపోతే పంటలు ఎండిపోతాయని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆర్డీఎస్‌ఎస్‌ పనులను వేగవంతం చేస్తే గ్రామీణ ప్రాంతాలకు త్రీఫేస్‌ విద్యుత్‌ వస్తుందన్నారు. వి.కోట–కేజీఎఫ్‌ మార్గంలో మార్కెట్‌ యార్డు ప్రాంతం వద్ద నిర్మించిన సీసీ రోడ్డుకు కనెక్టివిటీ ఏర్పాటు చేయలేదన్నారు అలాగే ఈ ప్రాంతంలో రోడ్డులో అన్ని గుంతలు పడ్డా ఆర్‌అండ్‌బీ అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గుడుపల్లెలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు.

జెడ్పీటీసీలంటే లెక్కలేదా

జెడ్పీటీసీలంటే అధికారులకు లెక్కలేకుండా పోయిందని నారాయణవరం జెడ్పీటీసీ సుమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ సమావేశాలకు తిరుపతి జిల్లా అధికారులు ఎప్పుడు హాజరుకావడం లేదని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనుల సమాచారాన్ని సభ్యులకు తెలపడం లేదన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో రూ.2.30 లక్షలతో పనులు చేస్తే రూ.1.90 లక్షలు మాత్రమే బిల్లులు మంజూరు చేశారని పేర్కొన్నారు. పనులు చేస్తే రూ.40 వేలు నష్టపోవాలా అని నిలదీశారు. ఇలాగే ఉంటే తిరుపతి జిల్లా సభ్యులు సమావేశాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. పీలేరు రోడ్డు అధ్వానంగా ఉందని ఎర్రవారిపాళ్యం జెడ్పీటీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి డీపీఓ సమావేశాలకు రావడం లేదని ఫిర్యాదు చేశారు. వేరుశనగ విత్తనాలు ఎప్పుడు ఇస్తారని పాలసముద్రం జెడ్పీటీసీ అన్బలగన్‌ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు గ్రూప్‌గా ఇచ్చే లోన్‌ కాకుండా వ్యక్తిగతంగా రుణాలు మంజూరు చేయాలన్నారు. అలాగే ఎన్టీఆర్‌ నైపుణ్య అభివృద్ధి సంస్థ పరంగా శిక్షణ ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పశుసంవర్థక శాఖ పరంగా ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ లోన్లు ఎప్పుడు మంజూరు చేస్తారని నగరి జెడ్పీటీసీ గాంధీ ప్రశ్నించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అంగన్‌వాడీ భవనాలు మంజూరు చేయాలని కోరుతున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఐరాలలో ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యక్రమాలకు పిలవడం లేదని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ కమిటీ చైర్మన్‌ భారతి అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనుంజయరెడ్డి, సీఈఓ రవికుమార్‌నాయుడు, డిప్యూటీ సీఈవో వెంకటనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా పరిషత్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశం తూతూమంత్రంగా జరిగింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం ఒంటి గంటలోపే ముగించారు. ఇందులో 4వ కమిటీ అయిన విద్య, వైద్య అంశాల చర్చకు కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. ఎప్పటిలాగే పలు శాఖల ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. మిగిలిన అధికారులు వచ్చామా.. వెళ్లామా.. అన్నట్లు వ్యవహరించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదు.

రెండుగంటల్లోనే

ముగిసిన జెడ్పీ సమావేశం

పర్సంటేజ్‌లు ఇస్తేనే బిల్లులు

పంచాయతీరాజ్‌లో జరిగిన అభివృద్ధి పనుల పరంగా బిల్లులు పెట్టాలంటే క్షేత్రస్థాయిలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు పర్సంటేజ్‌ అడుగుతున్నారని సదుం జెడ్పీటీసీ సోమశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో ఉన్నతాధికారులకు సైతం వాటా ఇవ్వాలని బహిరంగంగానే చెబుతున్నారని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో పంచాయతీరాజ్‌ శాఖ పనితీరు అధ్వానంగా ఉందని వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్‌రెడ్డి ఆరోపించారు. ఏ పనులూ సక్రమంగా జరగడం లేదన్నారు. కనీసం బిల్లులు కూడా పెట్టడం లేదన్నారు. పక్క జిల్లాలతో పోలిస్తే తిరుపతి జిల్లా వెనుకబడి ఉందన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement