చిత్తూరు అర్బన్: నేరాలు జరిగిన తర్వాత వెంటనే స్పందించడంతో పాటు నేరాలు జరగకుండా నియంత్రించే బాధ్యత పోలీసులపై ఉందని, ఇందుకోసం ‘సురక్షిత చిత్తూరు’ పేరిట చిత్తూరు పోలీసు శాఖ తీసుకొచ్చిన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ పిలుపునిచ్చారు. చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో శనివారం సురక్షిత చిత్తూరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల రక్షణతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ మోసాలకు అడ్డుకట్ట, రోడ్డు ప్రమాదాల నివారణకు ‘సురక్షిత చిత్తూరు’ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ ప్రజల భద్రత విషయంలో పోలీసులతోపాటు ప్రతి పౌరుడూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, చుడా చైర్‌పర్సన్ కటారి హేమలత, నాన్–కేడర్ ఎస్పీ రాజశేఖర్‌రాజు, ఏఆర్ ఏఎస్పీ దేవదాసు, డీఎస్పీ వెంకటనారాయణ, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.


