ఉపాధి కూలీలను అడ్డుకుని వెనక్కు పంపిన స్థానిక కూలీలు తమకు పనులు కల్పించాలంటూ నిరసన పన్నూరులో ఉద్రిక్తత.. అధికారుల తీరుపై ఆగ్రహం
కూలీల నిరసన
విజయపురం (నగరి): ఉపాధి పనుల కోసం ఉదయాన్నే ఆశగా వెళ్లిన కూలీలకు నిరాశే ఎదురైంది. పనులు లేవంటూ వారిని వెన క్కు పంపించడంతో కూలీలు ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటన శనివారం విజయపురం మండలం పన్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. ప్రతిరోజులాగే ఆలపాకం, ఆలపాకం కండ్రిగ, ముత్తప్పరెడ్డి కండ్రిగ, గొల్లకండ్రిగ, గొల్లకండ్రిగ హెచ్‌డబ్ల్యూ, సామిరెడ్డి కండ్రిగ, ఒడ్డిల్లు, పీఆర్ కండ్రిగ, తెల్లగుంట, బూచివానత్తం, కళియంబాకం, మిట్టకండ్రిగ తదితర గ్రామాల నుంచి వందలాది కూలీలు ట్రాక్టర్లు, ఆటోల్లో ఉపాధి పనులకు పన్నూరు గుట్టల ప్రాంతానికి చేరుకున్నారు. పన్నూరు చర్చి వద్దే స్థానిక కూలీలు వారిని అడ్డుకుని, తమ గ్రామంలోనే కూలీలకు సరిపడా కూలీలు గిట్టుబాటు కావ డం లేదని బయటి గ్రామాల వారు రావద్దని చెప్పి వెనక్కు పంపించారు. ఈ వ్యవహారంపై ఉపాధి హామీ అధికారులు స్పందించకపోవడంతో కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధి కూలీలు
ట్రాక్టర్లు, ఆటోల్లో వచ్చిన కూలీలను అడ్డుకుంటున్న స్థానిక కూలీలు
కూలీలు పనుల వద్దే నిరసనకు దిగారు. వారు మాట్లాడుతూ ‘‘పని కోసం వచ్చాం.. ఇప్పుడు పనిలేదని పంపిస్తే మా కుటుంబాలను ఎలా పోషించాలి?’’ ఒక రోజు పనిలేకపోతే పస్తులు ఉండాలి అంటూ వాపోయారు. గత 15 ఏళ్లుగా పన్నూరు గుట్టల్లో ఉపాధి పనులు చేస్తున్నామని, ఇప్పుడు పనులు లేవని చెప్పడం వెనుక కారణాలు ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. స్థానిక కూలీలను రెచ్చగొట్టి ఫీల్డ్ అసిస్టెంట్ ఈ పరిస్థితిని సృష్టించాడని ఆరోపించారు. తక్కువ మంది పనిచేసినా మస్టర్‌లో ఎక్కువ మంది పనిచేసినట్లు నమోదు చేయడం వల్లే కూలీలు గిట్టుబాటు కావడం లేదని పేర్కొన్నారు. కూలీ చెల్లింపుల్లో సమస్యలు ఉంటే అధికారులు చర్చించి పరిష్కారం చూపాల్సిందిపోయి, కూలీల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదని మండిపడ్డారు. ఆయా ఊర్లలోనే ఉపాధి పనులు పెడితే ఈ సమస్య ఎదురవదన్నారు. మస్టర్‌లో హాజరైన కూలీల పేర్లను గ్రామసభలో చదివి, ఆ వారంలో చేసిన పనికి ఎందుకు తక్కువ కూలీ వచ్చిందో ప్రజలకు వివరించాలని కోరారు. ఉపాధి హామీ పథకం చట్టం పేరు మార్పుపై ఉన్న ఆసక్తి కూలీలకు పని కల్పించడంలో ప్రభుత్వానికి లేదన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు.


