చిత్తూరు కలెక్టరేట్ : అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక కర్నూలు జిల్లా వెంకయ్యపల్లె వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని ఏపీ వీఆర్వోల సంఘం రాష్ట్ర మాజీ అసోసియేట్ అధ్యక్షుడు బాలాజీరెడ్డి తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ ఉద్యోగి ఇలాంటి దుస్థితిని ఎదుర్కోకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. కింది స్థాయి ఉద్యోగులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు బీఎల్‌వో విధులకు 14 ప్రభుత్వ శాఖల సిబ్బందిని ఉపయోగించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు సచివాలయ సిబ్బంది, వీఆర్వోలను మాత్రమే వినియోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినా వినకుండా బెదిరిస్తున్నారని విమర్శించారు. బలవంతంగా ఓటీపీలు తీసుకుని డ్యూటీలు వేయడం అధికారుల నిరంకుశత్వానికి అద్దం పడుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క వీఆర్వో కూడా అధికారుల ఒత్తిళ్లకు లొంగిపోయి, మనస్తాపంతో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పోరాడుదామని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అధికారుల వేధింపులపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న వీఆర్వో కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ముగిసిన గ్రంథాలయ శిబిరాలు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా వ్యాప్తంగా నిర్వ హించిన గ్రంథాలయ వేసవి శిక్షణ శిబి రాలు శనివారం ముగిశాయి. చిత్తూరులో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారిగురవారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడు తూ గ్రంథాలయాల్లో నిర్వహించిన శిబిరాల్లో పుస్తక పఠనం, వ్యాసరచన, చిత్ర లేఖనం, క్విజ్, పజిల్స్, చెస్, క్యార మ్స్, మ్యూజికల్ చైర్స్, లెమన్– స్పూన్ వంటి పోటీలు నిర్వహించామన్నారు. అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. వేసవి శిబిరాలతో జ్ఞానం పెరుగుతుందన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకత పెంపొదటానికి గ్రంథాలయాలకు వస్తుందలన్నారు. జిల్లా గ్రంథాలయ కార్యదర్శి శర్మ, గ్రంథాలయ అధికారి లావణ్య, విశ్రాంత ఉద్యోగులు లలిత, గజేంద్రబాబు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
2,400 మొక్కల పంపిణీ
పూతలపట్టు(యాదమరి): ప్రకృతిని కాపాడుకోవడం, రైతన్నలను ఆదుకోవడమే ధ్యేయంగా బైరెడ్డిపల్లి మండలానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు గంగాధర్ మొక్కల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం పి.కొత్తకోట సమీపంలో పూతలపట్టు, గంగాధరనెల్లూరు మండలాలకు చెందిన రైతులకు రూ.5 లక్షల విలువైన వంద రకాల 2,400 మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ నినాదాలకే పరిమితం కాకూడదని, ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి సంరక్షించాలని పిలుపునిచ్చారు. విలువైన మొక్కలను ఉచితంగా అందజేసిన గంగాధర్‌ను రైతులు అభినందించారు.


