యువకుడిపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

యువకుడిపై హత్యాయత్నం

Jun 7 2026 7:01 AM | Updated on Jun 7 2026 7:01 AM

● పాత కక్షలతో ట్రాక్టర్‌తో గుద్దిన వైనం ● కాలు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు ● కేసు నమోదు చేయని పోలీసులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పాతకక్షల నేపథ్యంలో యువకుడిని ట్రాక్టర్‌తో గుద్ది హత్య చేయడానికి ప్రయత్నించిన సంఘటన గంగవరం మండలంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడి తండ్రి సుబ్రమణ్యం కథనం మేరకు.. పెద్దపంజాణి మండలం సామనేరు పంచాయతీ బండకుంట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు అభిలాష్‌(18) గంగవరం మండలంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. అదే కళాశాలలో గంగవరం మండలం రామాపురం ఒడ్డిండ్లు గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ కుమారుడు నందకుమార్‌ చదివేవాడు. ఈ క్రమంలో నందకుమార్‌ తరచూ సుబ్రమణ్యం కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు బస్సులో వేధించేవాడు. దీనిపై ఆమె తన అన్న అభిలాష్‌తో పాటు ఇంట్లో చెప్పింది. ఆమె తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వారు నందకుమార్‌ను, అతని తల్లిదండ్రులను మందలించారు. దీంతో నందకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేసి చంపేస్తానని బెదిరించాడు. అభిలాష్‌ పలమనేరులో కంప్యూటర్‌ క్లాస్‌కు వెళ్తున్నాడని తెలుసుకున్న నందకుమార్‌ అతన్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. గత గురువారం స్నేహితుడు అజయ్‌తో కలిసి బైక్‌లో పలమనేరుకు వెళుతున్న అభిలాష్‌పై ట్రాక్టర్‌ ఢీకొన్నాడు. ద్విచక్ర వాహనాన్ని పొదల్లోకి లాక్కెళ్లాడు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహం చెందిన నందకుమార్‌ ట్రాక్టర్‌తో ఢీకొన్నాడు. దీంతో అభిలాష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో నందకుమార్‌ అక్కడి నుంచి ఉడాయించాడు. స్నేహితుడు అతన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించి జరిగిన విషయాన్ని అతని తల్లిదండ్రులకు తెలియజేశాడు. వారు గంగవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేయకుండా పెద్దపంజాణికి చెందిన టీడీపీ బడా నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని, లేకుంటే మీపైనే కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు బెదిరించినట్టు చెబుతున్నారు. సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. యువకుడు మదనపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై సీఐ రాంభూపాల్‌ను వివరణ కోసం ఫోన్‌ చేయగా ఆయన ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. ఆయన లీవ్‌లో ఉన్నట్టు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement