బంగారుపాళెం : మండలంలోని శేషాపురం సర్వీసు రోడ్డుపై శనివారం వరికోత యంత్రం ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బోడబండ్ల గ్రామానికి చెందిన జయశంకర్(37) సొంత పని నిమిత్తం ద్విచక్ర వాహనంలో పాలమాకులపల్లెకు బయలుదేరాడు. శేషాపురం సర్వీసు రోడ్డులో మొగిలి వైపు నుంచి బంగారుపాళెం వస్తున్న వరికోత యంత్రం ఢీకొంది. జయశంకర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్‌జీవో జిల్లా సహ అధ్యక్షుడిగా బాలసుబ్రమణ్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ఎన్‌జీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న బాలసుబ్రమణ్యం జిల్లా సహ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చిత్తూరు లోని ఏపీ ఎన్‌జీవో భవనంలో శనివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు, పరిశీలకులు కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లా సంఘంలో ఖాళీగా ఉన్న పలు కీలక పదవులను భర్తీ చేశారు. అలాగే ఉద్యోగుల సమస్యలపై చర్చించి పలు తీర్మానా లు చేశారు. సంఘం జిల్లా సహ అధ్యక్షుడిగా బాలసుబ్రమణ్యం, జిల్లా సంయుక్త కార్యదర్శిగా సురేష్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శిగా చిత్తూరు తాలూకా సంయుక్త కార్యదర్శిగా ఉన్న పవన్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అనంతరం రాష్ట్ర పరిశీలకులు కే.కిరణ్ కుమార్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్‌ను ఘనంగా సన్మానించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాఘవులు, కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.


