దిక్కులేని విద్య! | - | Sakshi
Sakshi News home page

దిక్కులేని విద్య!

Jun 6 2026 12:05 AM | Updated on Jun 6 2026 12:05 AM

● సీఎం సొంత జిల్లాలో విద్యాశాఖ అనాథ ● డీఈవో నియామకంలో తీవ్ర అలసత్వం

చిత్తూరు కలెక్టరేట్‌ : సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో రెగ్యులర్‌ డీఈవో లేక అవస్థలు పడాల్సి వస్తోంది. జిల్లాకు అత్యంత కీలకమైన రెగ్యులర్‌ డీఈవో నియామకంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వం పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి సమయం ఆసన్నమవుతున్నా, జిల్లా కు పూర్తి స్థాయి డీఈవోను నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

దీనికి ఎవరు భరోసా?

ప్రస్తుతం జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు వేలాది మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఆ విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న ఈ పరీక్షల నిర్వహణను, కేంద్రాల పర్యవేక్షణను సమన్వయం చేయాల్సిన ముఖ్యఅధికారి (డీఈవో) లేకపోవడం విద్యావ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చింది. పరీక్షల స్క్వాడ్‌ల ఏర్పాటు, ప్రశ్నపత్రాల భద్రత, పరీక్ష కేంద్రాల తనిఖీ వంటి కీలక బాధ్యతలను చూసే పూర్తి స్థాయి అధికారి లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో గందరగోళం ఏర్పడుతోంది.

ముందస్తు ప్రణాళిక శూన్యం

గత డీఈవో మే 31న ఉద్యోగ విరమణ పొందారు. ఆయన రిటైర్‌ అవుతున్నారనే విషయం ప్రభుత్వా నికి, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ముందే తెలిసినప్పటికీ కొత్త డీఈవోను నియమించే ఏర్పాట్లు చేయలేకపోయారు. కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠ్యపుస్తకాల పంపిణీ, యూనిఫామ్స్‌, బడుల నిర్వహణ పనులను పర్యవేక్షించాల్సిన తరుణంలో ఈ ఖాళీ ఏర్పడడం విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

రాజకీయ లాబీయింగ్‌

జిల్లాలో విద్యావ్యవస్థ సంక్షోభంలో పడుతుంటే ఆశావహులు మాత్రం డీఈవో కుర్చీని దక్కించుకునేందుకు రాజకీయ లాబీయింగ్‌ల్లో మునిగిపోయారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. డీఈవో కుర్చీ కోసం అమ్యామ్యాలు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్లు సమర్పించి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సీఎం సొంత జిల్లా కావడంతో ఇక్కడ పోస్టింగ్‌ తెచ్చుకుంటే పట్టు సాధించవచ్చనే ఆశతో సిఫార్సు లేఖలకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జిల్లాలో డీఈవోలుగా పనిచేసిన ఇద్దరు సీనియర్‌ అధికారులు అధికంగా పోటీపడుతున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో డీఈవోగా పనిచేసిన ఓ అధికారి, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా డీఈవో, ఇద్దరు డైట్‌ లెక్చరర్‌లు కుర్చీ కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారని విశ్వసనీయ సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement