గుడిపాల: ప్రజాసమస్యలను త్వరగా పరిష్కరించడం, రెవెన్యూశాఖలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు కార్యక్రమాన్ని జిల్లాలో మొట్టమొదటి సారిగా గుడిపాల జడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్, డీఎఫ్‌ఓ సుబ్బరాజు, ఆర్డీవో శ్రీనివాసులు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కరుణ కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తించి, అవసరమైతే ఫీల్డ్ సందర్శనలు నిర్వహించి ప్రజలకు సరైన మార్గదర్శకత్వం అందించాలని తెలిపారు. రీ సర్వేకు సంబంధించిన ఫిర్యాదులు కొన్ని గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్నాయనప్నారు. రీసర్వే జరగబోయే గ్రామాల్లో ప్రత్యేక అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. తహసీల్దార్లు తమ పరిధిలోని ఆర్‌ఐలు, డీటీలు, వీఆర్‌ఓల వద్దకు వచ్చిన ఫిర్యాదులను సమీక్షించి ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యల నివేదికను వారంలోపు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరో 15 రోజుల తర్వాత మళ్లీ మండల స్థాయిలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జేసీ రాజేంద్రన్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శిరీషా, ఎంపీపీ హరిప్రసాద్ పాల్గొన్నారు.


