ట్యాగ్‌ ఉంటేనే మందులు | - | Sakshi
Sakshi News home page

ట్యాగ్‌ ఉంటేనే మందులు

Jun 5 2026 4:23 AM | Updated on Jun 5 2026 4:23 AM

భారత్‌ పశుధన్‌ యాప్‌ అమలుతో

అవస్థలు

ఇయర్‌ ట్యాగ్‌, ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ తప్పనిసరి

చూలు పరీక్షలు, చికిత్సలకు కూడా

షరతులు

రైతులు–పశుసంవర్థక సిబ్బంది మధ్య నిత్యమూ వాగ్వాదాలు

కూటమి ప్రభుత్వం రైతులపై పగపట్టినట్టు కనిపిస్తోంది. సంక్షేమాన్ని పక్కన పెట్టి రోజుకో కొత్త నిబంధనను తీసుకువస్తూ ఇబ్బందులకు గురిచేస్తోంది. పాడి పశువులకు చికిత్సలు అందించడంలో కొర్రీలు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్‌ పశుధన్‌ యాప్‌ అమలులో భాగంగా ప్రతి పశువుకూ ఇయర్‌ ట్యాగ్‌ (కమ్మ) తప్పనిసరిని చేసింది. ట్యాగ్‌ ఉంటేనే పశువులకు చూలు పరీక్షలు, కృత్రిమ గర్భధారణ, చికిత్సలు చేస్తామని, మందులు అందజేస్తామని పేర్కొంది. ఈ విధానం జిల్లాలో ఈ నెల ప్రారంభం నుంచి అమలులోకి వచ్చింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో రైతులు, పశుసంవర్థక శాఖ సిబ్బంది మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి.

కాణిపాకం: చిత్తూరు జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమపై ఆధారపడి ఎక్కువ మంది రైతులు జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తి కూడా ఇక్కడే ఎక్కువగా జరుగుతుంది. పశుసంపదను కాపాడేందుకు ఒక జిల్లా పశువైద్యశాల, 14 ఏరియా పశువైద్యశాలలు, 68 వెటర్నరీ డిస్పెన్సరీలు, 75 రూరల్‌ లైవ్‌స్టాక్‌ యూనిట్లు, 297 రైతు భరోసా కేంద్రాల్లోని ఆరోగ్య సెంటర్లు సేవలందిస్తున్నాయి. జిల్లాలో సుమారు 5 లక్షల పాడి ఆవులు, 13.80 లక్షల మేకలు, లక్షలాది పశువులు ఉన్నాయి. వాటికి ట్యాగింగ్‌ ఏర్పాటు, వివరాల నమోదు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానాన్ని ఈ నెల ప్రారంభం నుంచి అమలులోకి తీసుకువచ్చింది. పశువులకు ట్యాగ్‌ ఉంటేనే చికిత్స అందించాలని, మందులు పంపిణీ చేయాలని ఆదేశించింది. జిల్లాలో ఉన్న లక్షలాది పశువులు, మూగజీవులకు ట్యాగ్‌ ఏర్పాటుచేయడం సిబ్బందికి సవాల్‌గా మారింది. ఒకవైపు సేవలు అందిస్తూ, మరోవైపు డిజిటల్‌ నమోదు బాధ్యతలు అప్పగించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

వృద్ధ రైతులకు మరింత ఇబ్బంది

జిల్లాలో పెద్ద సంఖ్యలో వృద్ధ రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో చాలామందికి స్మార్ట్‌ఫోన్లు లేవు. మొబైల్‌ నంబర్లు, ఆధార్‌ అనుసంధానం, డిజిటల్‌ నమోదు ప్రక్రియపై అవగాహన లేదు. వారికి యాప్‌ ఆధారిత వ్యవస్థ తలనొప్పిగా మారింది. ‘ఆవు అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యుడు వచ్చి చికిత్స చేయాలి. ముందుగా కమ్మ, ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ అడుగుతుండడంతో ఏమి చేయాలో తెలియడం లేదు. పశువు అనారోగ్యంతో మృత్యువాత పడితే ఎవరు బాధ్యత వహిస్తారు’ అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్యలు

భారత్‌ పశుధన్‌ యాప్‌లో వివరాల నమోదు పూర్తిగా ఆన్‌లైన్‌ ఆధారంగా జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు సరిగ్గా లేకపోవడంతో నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దీంతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో యాప్‌ నెమ్మదిగా పనిచేయడం, హ్యాంగ్‌ కావడం, డేటా సేవ్‌ కాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఫీల్డ్‌ సిబ్బంది చెబుతున్నారు.

షరతులతో ఇబ్బంది

పశువులకు అత్యవసర వైద్య సేవలు, చూలు పరీక్షలు, కృత్రిమ గర్భధారణ వంటి సేవలను ఎలాంటి షరతులు లేకుండా అందించాలని రైతులు కోరుతున్నారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ట్యాగింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని, సేవలు నిలిపివేయడం సరైన పద్ధతి కాదని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్‌ లేకుంటే సేవలు లేవ్‌..?

గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు వైద్య సేవలు అందించేందుకు వెళ్లే సిబ్బంది ముందుగా పశువుకు ఇయర్‌ ట్యాగ్‌ ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ట్యాగ్‌ లేకపోతే ట్యాగింగ్‌ చేసుకోవాలని, రైతు ఆధార్‌ కార్డు, మొబైల్‌ నంబర్‌ నమోదు చేయాలని సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సేవలు అందిస్తామని చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా ముందుగా నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని చెప్పడం వల్ల పశువుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాడి రైతులకు కొత్త కష్టాలు

Advertisement
 
Advertisement
Advertisement