చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో చోటుచేసుకుంటున్న మాతృమరణాలపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో నాగశశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. ఆయన గురువారం చిత్తూరులోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ మాతృమరణాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గర్భిణులు, బాలింతల సమస్యలను గుర్తించి వారి ని సకాలంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఎఫ్‌డీపీ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్లినప్పుడు అన్ని ఆరోగ్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని సూ చించారు. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో పరిశుభ్రత, ఉచిత వైద్య సేవలు, మందుల పంపిణీ, రోగుల సంతృప్తి ద్వారా పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ 80 శాతానికి పైగా ఉండేలా చూడాలన్నారు. ప్రతి వైద్యాధికారి నెలకు ఒకసారి గ్రామ ఆరోగ్య క్లినిక్‌లను తనిఖీ చేసి నివేదికను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. సంజీవిని కార్యక్రమంలో ఓపీకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఏబీహెచ్‌ఏ ఐడీని కేఎంసీ లింక్‌తో అనుసంధానం చేసి 100 శాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఆర్‌బీఎస్‌కే కింద అంగన్‌వాడీ, పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరీక్షలను పూర్తి చేసి వివరాలను అప్‌లోడ్ చేయాలని తెలిపారు. త్వరలో జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజలకు విస్తత అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో వెంకటప్రసాద్, హనుమంతరావు, అనిల్‌కుమార్, ప్రవీణ, అనూష, జార్జ్, రామ్మోహన్ తో పాటు పీహెచ్‌సీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.


