అస్తవ్యస్తంగా ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణ | - | Sakshi
Sakshi News home page

అస్తవ్యస్తంగా ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణ

Jun 5 2026 4:23 AM | Updated on Jun 5 2026 4:23 AM

11 కేంద్రాల్లో మౌలిక వసతులు కరువు

తాగేందుకు నీళ్లు లేవు...

భోజనాల్లో నాణ్యత కరువు

ఉక్కపోతతో అల్లాడుతున్న టీచర్లు

రూ.3 లక్షల స్టేషనరీలో గోల్‌మాల్‌

కలెక్టర్‌ అనుమతి అసలే లేదు

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రాథమిక విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) ఉపాధ్యాయ శిక్షణ తరగతులు క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరులో ఈ శిక్షణ నిర్వహణ తీరుపై ఉపాధ్యాయ లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 11 శిక్షణా కేంద్రాల్లో కనీస వసతులు కరువై, ఉపాధ్యాయులు నరకయాతన అనుభవిస్తున్నారు.

ఉక్కపోతలో అయ్యోర్లు.. కరువైన తాగునీరు

జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,886 మంది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం భానుడి భగభగలకు తోడు శిక్షణా కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక కేంద్రాల్లో ఫ్యాన్లు పనిచేయడం లేదు. మంచినీటి సదుపాయం కూడా కల్పించలేదు. ఉపాధ్యాయులు ఉక్కపోత భరించలేక ఇబ్బంది పడుతున్నారు. దాహార్తిని తీర్చుకోవడానికి బయటి నుంచి వాటర్‌ బాటిళ్లు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఆరు రోజులు జరిగే శిక్షణలో పాల్గొనే ఉపాధ్యాయులకు మధ్యాహ్నం అందించే భోజనం నాణ్యంగా లేదు. దీనిపై ఉపాధ్యాయులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. నాణ్యతగా అందించాల్సిన భోజనం రాష్ట్ర స్థాయి వెండర్ల పుణ్యమా అని నాసిరకం బియ్యం, చల్లారిన వంటకాలతో మమ అనిపిస్తున్నారు. ఒక్కో కేంద్రానికి ఆరు రోజుల శిక్షణా కాలానికి గానూ ప్రభుత్వం రూ.20 వేల చొప్పున బడ్జెట్‌ కేటాయించినప్పటికీ, ఆ నిధులు ఎటు పోతున్నాయో అర్థం కావడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

రూ.3 లక్షల స్టేషనరీలో భారీ గోల్‌మాల్‌

ఈ శిక్షణలో స్టేషనరీ కేటాయింపుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఉపాధ్యాయులకు పంపిణీ చేయాల్సిన స్టేషనరీ కిట్లను ఏకపక్షంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు రూ.3 లక్షల విలువైన స్టేషనరీ పంపిణీలో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ జరిగినట్లు తెలుస్తోంది. మార్కెట్‌ ధర కంటే తక్కువ నాణ్యత కలిగిన మెటీరియల్‌ను సరఫరా చేసి, బిల్లులను భారీగా క్లెయిమ్‌ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్టేషనరీని కేంద్రాలకు తరలించే ప్రక్రియలో కూడా సెక్టోరల్‌ అధికారులు చేతివాటం చూపించినట్టు సమాచారం. కొందరు అధికారులు సొంత కార్లలోనే స్టేషనరీని తరలించి బిల్లులు పెట్టుకున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే విద్యాశాఖ పర్యవేక్షణ ఈ స్థాయిలో పడకేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు శిక్షణా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టి, వసతులు మెరుగుపరచడంతో పాటు స్టేషనరీ అవినీతిపై విచారణ జరపాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు.

కలెక్టర్‌ అనుమతి ఏదీ..?

జిల్లాలో సాగుతున్న ఈ శిక్షణా తరగతులకు కలెక్టర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకపోవడం గమనార్హం. సాధారంగా జిల్లా స్థాయిలో ప్రభుత్వ నిధులతో చేపట్టే ఏ కార్యక్రమం, బడ్జెట్‌ కేటాయింపులకు కలెక్టర్‌ ఆమోదం తప్పనిసరి. సమగ్రశిక్ష శాఖ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. కలెక్టర్‌ అనుమతి లేకపోవడంతో శిక్షణా కేంద్రాల బడ్జెట్‌ ఖర్చు, స్టేషనరీ కొనుగోళ్లల్లో నిబంధనలకు నీళ్లు వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement