చోరీ కేసులో తండ్రీకొడుకుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో తండ్రీకొడుకుల అరెస్టు

Jun 5 2026 4:23 AM | Updated on Jun 5 2026 4:23 AM

– రూ.38 లక్షల విలువైన ఆభరణాలు సీజ్‌

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు నగరంలో జరిగిన చోరీ కేసులో తమిళనాడుకు చెందిన అంతర్రాష్ట్ర దొంగలు పెరుమాళ్ల క్రిష్ణ (54), ఇతని కుమారుడు కృష్ణ సంతోష్‌ కుమార్‌ (26)ను అరెస్టు చేసినట్టు డీఎస్పీ వెంకటనారాయణ, సీఐ నెట్టికంటయ్య తెలిపారు. వారు గురువారం చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. చిత్తూరు నాయుడు బిల్డింగ్స్‌కు చెందిన ఎన్‌పి.గౌతంకిరణ్‌ గతవారం ఇంటికి తాళం వేసుకుని హైదరాబాద్‌ వెళ్లాడు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కట్టమంచి వివేకానంద విగ్రహం వద్ద తిరుగుతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు చోరీకి పాల్పడినట్టు అంగీకరించారు. నిందితులు తమిళనాడు రాష్ట్రం కాట్పాడికి చెందిన పెరుమాళ్ల క్రిష్ణ, అతని కుమారుడు కృష్ణ సంతోష్‌ కుమార్‌గా గుర్తించారు. వారి నుంచి 186 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.75 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.38 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరిపైనా కర్ణాటకలో 17 కేసులు, తిరుపతిలో మూడు కేసులు ఉన్నాయని తెలిపారు. కేసును ఛేదించడంతో ప్రతిభ చూపించిన వన్‌టౌన్‌ ఎస్‌ఐ శివశంకర్‌, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

పరిశోధన అంశాలపై చర్చ

చంద్రగిరి: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాలలో విశ్వవిద్యాలయానికి సంబంధించిన జెనెటిక్స్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌ విభాగానికి సంబంధించిన పరిశోధన అంశాలపై మూడు రోజులపాటు జరగనున్న చర్చా కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ సత్యనారాయణ వర్చువల్‌ విధానంలో మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనువైన నూతన విత్తన రకాల రూపకల్పనపై దృష్టిసారించాలన్నారు. వర్సిటీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డీన్‌ డాక్టర్‌ పి.మునిరత్నం మాట్లాడుతూ.. విద్యార్థులు పరిశోధన నైతిక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఎం.రెడ్డి శేఖర్‌, వర్సిటీ జెనెటిక్స్‌ విభాగపు అధిపతి డాక్టర్‌ ఎస్‌.వసుంధర, ప్లాంట్‌ బ్రీడింగ్‌ విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎల్‌వి.సుబ్బారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement