కార్వేటినగరం: కార్వేటినగరంలో ఉన్న ప్రసిద్ధ వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సాయంత్రం అంకురార్పణ పూజలు చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ ఆలయ అధికారి చెంగల్‌రాయులు తెలిపారు. స్వామి వారు రోజుకో అవతారంలో వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారని వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం అంకురార్పణ, శనివారం ఉదయం 8.10 నుంచి 8.45 గంటల మధ్య కర్కాటక లగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రాత్రికి పెద్ద శేషవాహనం ఉంటుందని తెలిపారు. ఆదివారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 8వ తేదీ ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి, 9వ తేదీ కల్పవృక్ష వాహనం, ఆర్జిత కల్యాణోత్సవం, రాత్రి సర్వభూపాల వాహనం నిర్వహిస్తామన్నారు. 10వ తేదీ ఉదయం మోహనీ అవతారం, రాత్రి గరుడ వాహనం, 11వ తేదీ ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం వసంతోత్సవం, రాత్రి గజవాహన సేవలు ఉంటాయని తెలిపారు. 12వ తేదీ ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ, 13వ తేదీ ఉద యం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 14వ తేదీ ఉదయం పల్లకి సేవ, చక్రస్నానం, ఽసాయంత్రం ధ్వజాఅవరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
సంతాన ప్రదాత వేణుగోపాలుడు
ఇక్కడ కొలువైన వేణుగోపాల స్వామి సంతాన ప్రదాతగా విరాజిల్లుతున్నాడు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారితో పూజలందుకుంటున్న రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవతా మూర్తులను ఇక్కడికి తెప్పించి ప్రతిష్టించినట్లు పురాణ కథనం. ఆకాశరాజు తర్వాతి వంశానికి సంతానం కలగక పోవడంతో నారాయణరాజు వెంకటాచలమున తపస్సు చేసి స్వామి వారి అనుగ్రహం పొందినట్లు శాసనాలు చెబుతున్నాయి. అందువల్లే ఆయన వంశానికి చెందిన వెంకటపెరుమాళ్‌రాజు 1610–1719 మధ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 1936 నుంచి ఈ ఆలయ నిర్వాహణ దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చింది. 1989 ఏప్రిల్ 10 నుంచి టీటీడీ పరిధిలోకి చేరింది. ఆలయంలో మకరతోరణం, గోమాతతో రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలుడి విగ్రహాలను ఏకశిలతో రూపొందించడం విశేషం. ఆలయ ఆవరణంలో శ్రీఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఉన్న సుమారు వంద అడుగులకు పైగా ఏక శిల ధ్వజస్థంభం భక్తులను ఆకట్టుకుంటోంది.
14 ఎకరాల్లో అతిపెద్ద స్కంధ పుష్కరిణి
వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన స్కంధ పుష్కరిణి ఆసియాలోనే అతిపెద్దది. దీన్ని 19వ శతాబ్దంలో కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు అప్పటి కార్వేటినగరం సంస్థానాధీశుడైన వెంకటపెరుమాళ్ రాజు 14 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. పుష్కరిణి మెట్లపై దేవతా మూర్తులు, సర్పాలు, శృంగార శిల్పాలను చెక్కించారు. నీటి మట్టం ఏ వైపు చూసినా సమాతంరంగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. శ్రీవేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం, తెప్పోత్సవాలను ఈ పుష్కరిణిలో వైభవంగా నిర్వహిస్తారు.


