కుప్పం రూరల్ : కుప్పం మండలం ఎర్రగుట్టచేను వద్ద గురువారం అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. ఎర్రగుట్టచేనుకు చెందిన జ్ఞానశేఖర్ (26)ను గుర్తు తెలియని ముగ్గురు యువకులు వదిలిపెట్టి వెళ్లారు. అప్పటికే జ్ఞానశేఖర్ మృతి చెంది ఉన్నాడని, చేతులు, కాళ్లపై గాయాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. జ్ఞానశేఖర్ మృతిపై అనుమానం ఉన్నట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
స్వరమాంత్రికుడు బాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సంగీత జగతి లో విశ్వస్వర మాంత్రికుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రజల మనసును చూరగొన్నారని జిల్లా జైలు సూపరింటెండెంట్ కె.వెంకటరెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలో గురువారం భారతీయ తెలుగు రచయితల సమాఖ్య, ఎం.వి. కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ సంయుక్తంగా ప్రముఖ సాహితీవేత్త మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో ప్రఖ్యా త గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ తన మధురమైన స్వరంతో, శ్రావ్యమైన సంగీతంతో ఐదున్నర దశాబ్దాలుగా శ్రోతలను రంజింపజేశారని కీర్తించారు. ఏపీఎస్ ఆర్టీసీ మాజీ ఉపాధ్యక్షుడు మిద్దెల హరి మాట్లాడుతూ 16 బాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో ఎస్పీబాలు సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. రచయితల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు సి.నారాయణ స్వామి, ఎం.వి.కేశవరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షుడు ఎం.వి.శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ గాన గంధర్వుడు బాలుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం 150 మంది గాయకులు, తెలుగు భాషాభిమానులకు సాహితీవేత్త మర్రిపూడి దేవేంద్రరావు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారాలు 2026ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో తోటగోవిందన్, ఎస్.మునీంద్ర, ఎం.జగదీష్‌కుమార్, నాగరాజ, శ్రీరాజు, ఆర్.షాజహాన్, జి.గోవిందయ్య, కొఠారి వెంకటరత్నం, జి.శాంతకుమారి, పాడి రాధ, యువన్య, రాజరత్నం రెడ్డి, లీలమనోహర్ రెడ్డి, సంధ్యాశర్మ, నాట్యాచార్యులు శ్రీరాంబాబు, నృత్య కళాకారిణి జ్ఞాశ్రిత పాల్గొన్నారు.


