చేసింది శూన్యం
నగరి: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజల నడ్డి విరిచిందని, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైనట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. పుత్తూరు పట్టణంలోని ఏడీకే కల్యాణ మండపంలో మాజీ మంత్రి ఆర్కేరోజా ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలు అడుగుతుంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పు కోవడంతో ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు.
రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చేశాం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జగనన్న పాలనను దూరం చేసుకున్నందుకు ప్రజలు నేడు బాధపడుతున్నారన్నారు. సంక్షేమ పథకాలు ఈ రోజు రాష్ట్రంలో అందడం లేదన్నారు. రైతు భరోసాకు, అమ్మ ఒడికి మొదటి ఏడాది పంగనామాలు పెట్టారన్నారు. రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదన్నారు. 30 లక్షల తల్లులకు అమ్మఒడి దూరం చేశారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగాకు టీ ఇచ్చాను, గద్దర్‌కు కారు కొనిచ్చా అని చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారన్నారు. ఆయన్ను నమ్ముకున్న వలంటీర్లుకు ఉద్యోగాలు పీకేస్తే కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను దొడ్డిదారిన అమ్ముకుని, మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చిన ఘనత విద్యాశాఖ మంత్రి లోకేష్‌కే దక్కిందన్నారు. సుగాలీ ప్రీతి తల్లి కన్నీళ్లు తుడవడానికి రాజీయాల్లోకి వచ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు కనీసం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన మోసాలను ప్రజలకు వివరించేందుకే ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, జిల్లా టాస్క్‌ఫోర్స్ టీం వజ్రభాస్కర్‌రెడ్డి, జోనల్ బూత్ కమిటీ అధ్యక్షులు భరత్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, ఎంపీపీలు, వైస్‌ఎంపీపీలు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


