సూపర్ సిక్స్ అమలులో కూటమి ఫైయిల్ మోసపూరిత హామీలతో జనం నడ్డి విరిచారు దగా పాలనపై 4 నుంచి 12 వరకు నిరసనలు వెన్నుపోటుకు రెండేళ్లు బుక్‌లెట్ విడుదల మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
కార్వేటినగరం: కూటమి రెండేళ్ల పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజల నడ్డివిరిచారని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ధ్వజమెత్తారు. బుధవారం పుత్తూరులోని తన నివాసంలో నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో నాయకులతో కలిసి వెన్నుపోటుకు రెండేళ్లు బుక్‌లెట్ విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికార దాహంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకపోగా 6 లక్షలకుపైగా పింఛన్లు తొలగించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఏడాదికి రూ.15వేలు, నిరుద్యోగభృతి నెలకు రూ.3 వేలు లాంటి హామీలను తుంగలో తొక్కారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ పథకం ఏమైందని నిలదీశారు. సూపర్ సిక్స్ హామీ సూపర్‌గా ఫెయిల్ అయ్యిందని ఎద్దేవా చేశారు.
డైవర్షన్ పాలిటిక్స్
చంద్రబాబు ప్రభుత్వం సూపర్‌సిక్స్ హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని జీడీనెల్లూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కళత్తూరు కృపాలక్ష్మి విమర్శించారు. మెడికల్ కళాశాలలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న తీసుకొస్తే, నేడు చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేటు పరం చేసి కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. అన్నదాతలకు ఏటా రూ.20 వేలని చెప్పి పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని నీరుగార్చారని ధ్వజమెత్తారు. వెన్నుపోటు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో నేటి నుంచి 12వ తేదీవరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు శేఖర్‌రాజు, తులసీయాదవ్, మణి, జెడ్పీటీసీ సభ్యులు సుకుమార్, చందురాజు, కిషోర్‌రెడ్డి, కాళప్ప, ధనశేఖర్‌యాదవ్, ఆకుల గోపి, రాజారాం మందడి, ధన్‌రాజ్,శివాజీ, జనార్దన్, కోలార్‌ప్రకాష్, రామయ్య, వెంకటేష్‌రెడ్డి, ధనంజయవర్మ, మదివాణన్, పట్నం ప్రభాకర్‌రెడ్డి, హరిరెడ్డి, కుప్పయ్య, శ్యామ్, దినేష్, మహేష్ పాల్గొన్నారు.


