చిత్తూరు కలెక్టరేట్ : నవచేతన ఏఐ యాప్‌తో చిన్నారుల్లో లోపాలను గుర్తించవచ్చని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల సమగ్ర అభివృద్ధి, ఆరోగ్య స్థితిని మరింత సమర్థవంతంగా అంచనా వేసేందుకు నవచేతన ఏఐ యాప్ ఆవిష్కరించారన్నారు. క్షేత్ర స్థాయిలో సీడీపీవోలు, సూపర్‌వైజర్లు నిరంతరం అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ఆరేళ్లు వయస్సు గల పిల్లల్లో ఎదుగుదల లోపాలు, పోషకాహార స్థితి, అభివృద్ధి మైలురాళ్లు, ఇతర ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి మాట్లాడుతూ నూతనంగా ఆవిష్కరించిన యాప్‌లో మూడు పద్ధతుల్లో స్క్రీనింగ్ చేసి 21 రకాల లోపాలను గుర్తించవచ్చని తెలిపారు. సమావేశంలో డాక్టర్ చైతన్య, డాక్టర్ రాజేష్, సీడీపీవోలు, సూపర్‌వైజర్‌లు పాల్గొన్నారు.
గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టం ఒక వరం
జిల్లాలోని గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టం ఒక వరమని కలెక్టర్ తెలిపారు. గిరిజన, అటవీ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల మేలు కోసం పార్లమెంట్‌లో తీసుకొచ్చిన ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) 2006 గొప్ప చట్టమన్నారు. బంగారుపాళ్యం మండలం పరిధిలో రోడ్ల నిర్మాణానికి అటవీ భూములు కేటాయింపు ప్రతిపాదనలు పరిశీలించి, జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. తుంబపాళ్యం నుంచి చెట్టువారిపల్లి కాలనీ వరకు 0.972 హెక్టార్లు, గొర్రెలనగరి నుంచి వేపనపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి 0.970 హెక్టార్లు, రాగిమానుపెంట నుంచి కేఎం కండ్రిగ వరకు 0.675 హెక్టార్‌ల అటవీ భూమికి ఆమోదం తెలిపామన్నారు. జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, డీఎఫ్‌వో సుబ్బురాజ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి పాల్గొన్నారు.


