కూల్‌లిప్‌ మత్తు | - | Sakshi
Sakshi News home page

కూల్‌లిప్‌ మత్తు

Jun 1 2026 12:20 AM | Updated on Jun 1 2026 12:20 AM

● పెరుగుతున్న కూల్‌ లిప్‌ వినియోగం ● పాఠశాల సమీపంలోని బంకుల్లో విక్రయాలు ● పోలీసుల టెస్టుల్లోను బయటపడుతున్న పాజిటివ్‌ కేసులు ● ఆందోళనలో తల్లిదండ్రులు

ఇటీవల అడవికొత్తూరు సత్రవాడ మార్గంలో ముళ్లకంపల మాటున కూల్‌లిప్‌ పిల్లోస్‌ వాడే కొందరు ఒక బాలికను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. బాలిక కేకలు వేయడంతో స్థానికంగా ఉన్నవారు అక్కడికి రావడంతో దుండగులు పరుగులు తీశారు.

ఈనెల 27వ తేదీన నగరి మండలం ఓజీ కుప్పం మార్గంలో 12 కేజీల గంజాయి తరలిస్తున్న పినతండ్రి, కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు.

కొన్ని నెలల క్రితం విశాఖపట్నం నుంచి నగరి ఓజీకుప్పానికి రెండు కేజీల గంజాయి తీసుకువస్తున్న భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రమాదంలో

విద్యార్థుల భవిష్యత్తు

నగరి : ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైన డ్రగ్స్‌ నేడు గ్రామాలకు వ్యాపించాయి. అక్రమార్జనకు అలవాటు పడిన కొంతమంది డ్రగ్స్‌ను వివిధ రూపాలు మార్చి యువత చెంతకు చేరుస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా పౌడర్‌ ప్యాకెట్లు, సిగరెట్ల రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇటీవల పొగలేని ఫిల్టర్‌ పొగాకు ప్యాకెట్లయిన కూల్‌లిప్‌ పిల్లోస్‌ రూపంలో విద్యార్థులకు చేరవేస్తున్నారు. వాటిని ఒక్కసారి వాడిన విద్యార్థులు బానిసలుగా మారుతున్నారు. డ్రగ్స్‌ను నిరోధించడానికి పోలీసు శాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండడం లేదు. పాఠశాలల బయట ఉన్న బంకుల్లో ఈ పిల్లోస్‌ లభిస్తున్నాయి. విద్యార్థుల బ్యాగుల్లో ఆటవస్తువులు, పెన్సిళ్లు, పుస్తకాలు, చాక్లెట్లకు బదులుగా కూల్‌లిప్‌ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని తీసుకున్న విద్యార్థుల ప్రవర్తనలో తీవ్ర మార్పులు గమనిస్తున్నామని చెబుతున్నారు. తక్కువ ధరకు లభిస్తుండడం, వాటిని వాడినప్పుడు ఎదోలా ఉండడంతో ఒకరిని చూసి మరొకరు వాడుతున్నట్టు పేర్కొంటున్నారు. కూల్‌లిప్‌ పాకెట్లలో ఉండే మత్తు పదార్థాల ప్రభావంతో యువత ఆరోగ్యం దెబ్బతింటోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్‌, గుండెనొప్పి, దంతాలు పాడైపోవడం తదితరాలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. మత్తుకు బానిసలవుతున్న కొంతమంది యువకులు చదువులపై ఆసక్తి కోల్పోయి అసాంఘిక కార్యకలాపాల వైపు మళ్లుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల మైదానాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సరిహద్దు నుంచి సరఫరా

నగరి నియోజకవర్గం తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉంది. ఈ క్రమంలో అక్కడి నుంచి కూల్‌లిప్‌ ప్యాకెట్లు సరఫరా అవుతున్నట్టు సమాచారం. హర్యానాలో తయారుచేసే ఈ నిషేధిక గంజాయి కూల్‌లిప్స్‌ గతంలో తమిళనాడు, కేరళకు సరఫరా అయ్యేవి. అక్కడి ప్రభుత్వాలు పూర్తిగా నిషేధం విధించడంతో మన రాష్ట్రానికి చేరవేస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వం వాటిని కట్టడి చేయడంలో విఫలం కావడంతో అమ్మకాలు ఊపందుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కుటుంబ సమేతంగా రవాణా

కొంతమంది ఎవ్వరికీ సందేహం రాకుండా కుటుంబ సమేతంగా మత్తుపదార్థాల విక్రయాన్ని నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలు, తండ్రీకూతురు అంటూ ఊరికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుంటున్నట్టు ద్విచక్ర వాహనాల్లో తిరుగుతూ ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. కొన్నిసార్లు వాహనాల తనిఖీలో బయటపడుతుండగా, ఇంటి వద్ద నిల్వచేసిన గంజాయిని కార్డెన్‌ సెర్చ్‌లో గుర్తిస్తున్నారు. ఇలా నగరి మండలం ఓజీ కుప్పం, గ్రామానికి వెళ్లే దారిలోను గంజాయి పలుమార్లు పట్టుబడింది. ఇలాగే కూల్‌ లిప్‌ ప్యాకెట్లను గుట్కా ప్యాకెట్లతో కలిసి బంకులకు సరఫరా చేస్తున్నారు. తిరుపతి జిల్లా పుత్తూరు కేంద్రంగా కూల్‌లిప్‌ సరఫరా జరుగుతున్నట్టు సమాచారం.

బూస్ట్‌ పేరిట విక్రయాలు

కూల్‌లిప్‌అమ్మకాలపై నిషేధం ఉండడంతో వీటి ని కొనుగోలు చేసుకునే విద్యార్థులు, యువకులు దుకాణదారుల వద్ద బూస్ట్‌ ప్యాకెట్‌ ఉందా అని అడుగుతున్నారు. దుకాణదారు ఆ ప్యాకెట్లను బహిరంగంగా ఇవ్వకుండా న్యూస్‌ పేపర్‌లో పొట్లం చుట్టి ఇస్తున్నాడు. ఒక సాచెట్‌లో 40 పిల్లోస్‌ ఉంటాయి. పరిమాణాన్ని అనుసరించి రూ.40 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు.

టెస్టుల్లో బయటపడుతున్న పాజిటివ్‌ కేసులు

ఎస్పీ తుషార్‌డూడీ అందించిన కిట్ల ఆధారంగా ఆదివారం నగరి సబ్‌ డివిజన్‌ పరిధిలోని నగరి, నిండ్ర, విజయపురం, పాలసముద్రం, ఎస్‌ఆర్‌ పురం మండల్లాలో 13 మందిని పరీక్షించారు. విజయపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒకరికి, పాలసముద్రం, వెదురుకుప్పం మండలాల పరిధిలో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా నమోదైంది.

గంజాయి అమ్మినా.. వాడినా జైలుకే

నగరి : గంజాయిని అమ్మినా, ఎవరైనా వినియోగించినా జైలుకెళ్లడం ఖాయమని నగరి అర్బన్‌, రూరల్‌ సీఐలు మల్లికార్జునరావు, భాస్కర్‌ హెచ్చరించారు. వారు ఆదివారం జిల్లా ఎస్పీ తషార్‌ డూడి ఆదేశాల మేరకు నగరి మండలం ఓజీ కుప్పం, నిండ్ర మండలం మిట్టకండ్రిగ ఎస్టీ కాలనీ, విజయపురం మండలం కాళికాపురం గ్రామాల్లో కార్డెన్‌ సెర్చ్‌ చేపట్టారు. ప్రతి ఇంటినీ తనిఖీ చేసి అందులో ఉంటున్న వారి వివరాలు, వాహనాల రికార్డులను పరిశీలించారు. యువతకు డ్రగ్స్‌ డిటెక్షన్‌ కిట్ల ద్వారా పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో నగరి, నిండ్ర, విజయపురం ఎస్‌ఐలు, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement