కుప్పం : కుప్పం పట్టణంలో వెలసిన ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో జాతరను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు దాతలు భక్తులకు అన్నదానం చేయడానికి విరాళాలు ఇచ్చారు. వాటిని పాలక వర్గం పెద్దలు అన్నా క్యాంటీన్ ఖాతాలకు తరలించారు. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతర ముగిసి వారం రోజులు అవుతున్నా అన్నా క్యాంటీన్‌కు చేరిన అమ్మవారి అన్నదానం విరాళాల వివరాలను బయట పెట్టకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 15వ తేదీన తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. ఈ క్రమంలో అన్నదానం కోసం విరాళాలు సేకరిస్తున్నట్టు ప్రకటించారు. బ్యానర్ ఏర్పాటు చేసి అందులో ఒక బ్యాంకుకు సంబందించిన క్యూర్ కోడ్‌ను ముద్రించారు. దాన్ని స్కాన్ చేస్తే అన్యా క్యాంటీన్ ఖాతాలో నగదు జమ అయినట్టు చూపించింది. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో పాలక వర్గం నాయకులు స్పందించారు. ప్రతి పైసాకూ రికార్డులు ఉన్నాయని తెలిపారు. జాతర ముగిసి వారం రోజులు అవుతున్నా లెక్కలను బయట పెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం వద్ద ఏర్పాటుచేసిన హుండీల్లో కానుకలను సమర్పించారు. ఆ లెక్కలను బయటపెట్టిన పాలక వర్గం అన్నదానం కోసం వచ్చిన విరాళాల వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు.


