పాతుకుపోయారు! | - | Sakshi
Sakshi News home page

పాతుకుపోయారు!

Jun 1 2026 12:14 AM | Updated on Jun 1 2026 12:14 AM

● కాణిపాకంలో ఒకేచోట విధులు ● పెరుగుతున్న అనుమానాలు ● టికెట్ల గోల్‌మాల్‌తో తెరపైకి ● అంతర్గత బదిలీలపై వెల్లువెత్తిన విమర్శలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కాణిపాకం వరసిద్ధుడి సన్నిధిలో ప్రభుత్వ నిబంధనలు, దేవాదాయ శాఖ మార్గదర్శకాలు పాటించడం లేదు. కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయాల గోల్‌మాల్‌ వెలుగులోకి వచ్చింది. వీటి వెనుక ఉన్న బలమేంటి? ఆ శక్తి ఎవరు అన్న ప్రశ్నలు భక్తుల నుంచి వినిపిస్తున్నా యి. బదిలీలు, అంతర్గత బదిలీలు సక్రమంగా జరిగి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవా అన్న చర్చ ఆలయ వర్గాల్లోనూ నడుస్తోంది.

నిబంధనలు ఒకలా.. అమలు మరోలా..

దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ ఉద్యోగులను మూడేళ్లకు ఒకసారి బదిలీ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇతర సిబ్బందికి కూడా అంతర్గత బదిలీలు చేస్తూ ఒకే విభాగంలో ఎక్కువకాలం ఉండకుండా చూడాలి. కాణిపాకంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొందరు ఉద్యోగులు సంవత్సరాలుగా అదే విభాగాల్లో కొనసాగుతున్నారని పలువురు ఉద్యోగులు, ఉభయదారులు, కూటమిలోని ఒక వర్గం నేతలు మండిపడుతున్నారు.

రిటైర్డ్‌ అయినా రిలీవ్‌ కాని ఉద్యోగి?

ఒక ఉద్యోగి ఉద్యోగ విరమణ చేసినప్పటికీ కార్యాలయ పరిసరాల్లో చురుగ్గా కనిపిస్తున్నారనే చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన కొన్ని సమావేశాలకు కూడా హాజరైనట్లు సమాచారం. అధికారిక బాధ్యతలు లేకపోయినా కార్యాలయ వ్యవహారాల్లో ఆయన జోక్యం కనిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. కార్యాలయంలోని కుర్చీల్లో అతుక్కుపోయారన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై కూటమికి చెందిన ఒక వర్గం నేతలు, ఉభయదారులు, ఉద్యోగులు భగ్గుమంటున్నారు.

టికెట్ల విక్రయంలో గోల్‌మాల్‌..?

ఇటీవల ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయాలకు సంబంధించిన అవకతవకలు బట్టబయలయ్యాయి. ఈ విషయంపై ఒక ఉన్నతాధికారి సీసీ కెమెరాల ఆధారంగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. వాస్తవాలు బట్టబయలు కావడంతో సిబ్బందిపై వేటు వేసినట్టు సమాచారం. ఈ బాగోతాన్ని ఆ ఉన్నతాధికారి పసిగట్టేంత వరకు సంబంధిత ఏఈవోలు, పర్యవేక్షకులు ఏమి చేస్తున్నారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే బాధ్యతలో ఏళ్ల తరబడి కొనసాగడం వల్ల వ్యవస్థలో పట్టు పెరిగి, పర్యవేక్షణ బలహీనపడే ప్రమాదం ఉందని పలువురు ఉద్యోగులు, ఉభయదారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement