రూ.పది కోట్ల భూమి కబ్జా! | - | Sakshi
Sakshi News home page

రూ.పది కోట్ల భూమి కబ్జా!

Jun 1 2026 12:14 AM | Updated on Jun 1 2026 12:14 AM

● కూటమి నేతల అండతో 20 మంది ప్రయత్నం ● కలెక్టర్‌కు అర్జీ ఇచ్చినా బాధితులకు అందని న్యాయం ● అక్రమంగా భూమిలో మామిడి మొక్కలు నాటిన వైనం

పలమనేరు: బైరెడ్డిపల్లి మండలం బురిశెట్టిపల్లి వద్ద పలమనేరు–కుప్పం రహదారికి ఆనుకుని ఉన్న రూ.10 కోట్ల విలువజేసే డీకేటీ భూమిని కూటమి నేతల అండతో 20 మంది కబ్జా చేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు.. బేలుపల్లి రెవెన్యూ లెక్క దాఖలాలో బురిశెట్టిపల్లి వద్ద 7.50 ఎకరాల డీకేటీ భూమి బురిశెట్టిపల్లికి చెందిన చాకల గంగప్ప ఆధీనంలో ఉంది. ఇందులో సర్వే నంబర్‌ 935/2ఏ, 2బీలలో 2.63 ఎకరాలు రికార్డుల్లో నమోదు కాగా మిగిలిన భూమి ప్రభుత్వ భూమిగా ఉంది. ఆయన మరణాంతరం ఈ భూమి ఆయన సోదరులైన చాకల వెంకటేశు, చాకల వెంకటక్రిష్టప్ప పేరు మీద రికార్డులు మారాయి. తన తండ్రికి కొడు కులు లేనందున కుమార్తెగా ఆ భూమికి హక్కు తనదేనని గంగప్ప కుమార్తె విమలమ్మ పట్టా మార్పుకోసం 2003 నుంచి అధికారులకు అర్జీలు ఇస్తూనే ఉంది. ఇలా ఉండగా ఇటీవల అదే గ్రామానికి వెందిన బొంగోళ్ల సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు 20 మంది కూటమి నేత అండతో ఆ భూమి తమదేనంటూ ఆక్రమించి జేసీబీలతో చదును చేశారు. బాధితురాలు విమలమ్మ మే 25న గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన బైరెడ్డిపల్లి తహసీల్దార్‌ ప్రసన్నకుమార్‌ ఈ భూమిలో ఎవరి అనుభవం లేదని పిటిషనర్‌కు ఎండార్స్‌మెంట్‌ ఇచ్చారు. దీన్ని అలుసుగా తీసుకున్న ఆక్రమణదారు లు తాము రెవెన్యూ అధికారులకు డబ్బులిచ్చామంటూ భూమిలోకి ప్రవేశించి గుంతలు తవ్వి మామిడి మొక్కలు నాటేశారు. దీనిపై బాధితురాలు మరో మారు జిల్లా అధికారులను కలిసింది. పూర్తి స్థాయిలో విచారించాలని కలెక్టర్‌ ఇక్కడి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆక్రమణదారులు మాత్రం అధికారముందనే సాకుతో భూమిని కబ్జా చేసేశారు. ఇలా ఉండగా బాధితురాలు కుటుంబ సభ్యులు కూడా టీడీపీ సానుభూతిపరులు కావడం గమనార్హం. వారి భూములనే అదే పార్టీ వారు ఆక్రమించడం కొసమెరుపు. జిల్లా కలెక్టర్‌ స్వయంగా వచ్చి తమకు న్యాయం చేయాలని బాధితురాలు మీడియాను కలిసి విన్నవించింది.

Advertisement
 
Advertisement
Advertisement