మామిడి రైతులపై కూటమి కక్ష | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతులపై కూటమి కక్ష

Jun 1 2026 12:14 AM | Updated on Jun 1 2026 12:14 AM

బాబు హయాంలో బజారున పడుతున్న రైతులు

రైతుల గోడు వినిపించడం లేదా

చంద్రబాబూ..?

జగన్‌ ప్రభుత్వంలో టన్ను రూ.27 వేలు, ఇప్పుడు రూ.5 వేలు

మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

కార్వేటినగరం: కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా నరకం చూపిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. ఆయన ఆదివారం పుత్తూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో వేలాది మంది రైతులు మామిడి సాగు చేపట్టారని తెలిపారు. ప్రతి ఏటా వారికి గిట్టుబాటు ధర అందక నష్టాల బారిన పడుతున్నారని, వారి ఆవేదన కూటమి పాలకులకు పట్టడం లేదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లాలోనే రైతులు రోడ్డున పడితే స్పందించక పోవడం దారుణమని విమర్శించారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మామిడి టన్ను రూ.27 వేలు పలికిందని గుర్తు చేశారు. ఇప్పుడు రూ.5 వేలకు కూడా వ్యాపారులు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతులపై జరుగుతున్న ఆర్థిక దాడి కాదా అని ప్రశ్నించారు. రైతులకు కులం, పార్టీ లేదని, భూమే వారి జీవనాధారమని పేర్కొన్నారు. అలాంటి రైతుల కడుపు కొట్టే ప్రభుత్వాలు మట్టిలో కలిసిపోతాయన్నారు. రైతులు కన్నెర్ర చేస్తే సింహాసనాలు కూలిపోతాయని హెచ్చరించారు. రైతు కుటుంబంలో పుట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు రైతులను అష్టకష్టాలు పెట్టడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. రెండేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకుపోతున్న మామిడి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓటు వేసి మోసపోయామని రైతులు గగ్గోలు పెడుతున్నారని వివరించారు. ఇప్పటికై నా చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మొద్దని మామిడి రైతులకు సూచించారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేసిన జగనన్నకు అండగా నిలవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement