అందరూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
కృపాలక్ష్మి గెలుపునకు కృషి చేయండి
తమిళనాడు తరహా ఎన్నికలు రావాలి
గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పండి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
కార్వేటినగరం: కూటమి ప్రభుత్వంలో సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరిట వైఎస్సార్ సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, ప్రతి ఒక్క బీఎల్‌ఏ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లిమిట్ట దీపికా కల్యాణ మండపంలో శనివారం బూత్‌లెవల్ ఏజెంట్ల కు సర్‌పై అవగాహన కల్పించారు. ఇందులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి బీఎల్‌ఏలు బీఎల్‌వోలతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లను నిశితంగా పరిశీలించాలన్నారు. కొత్త ఓటర్లను విధిగా చేర్పించాలన్నారు. ప్రతి ఓటూ మనకు ముఖ్యమన్నారు. ఒక్క ఓటుతోనే ప్రభుత్వాలు కూలిపోయిన సంఘటనలు ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని బీఎల్‌ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి పంచాయతీలోనూ మన పార్టీ అభ్యర్థిని గెలిపించి వైఎస్సార్ సీపీ జెండాను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, దమనకాండలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి అభిమానులు ఉన్నారని, జగనన్న విజయాన్ని చంద్రబాబు ఆపలేరని అన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కళత్తూరు కృపాలక్ష్మిని గెలిపించే బాధ్యత బీఎల్‌ఏలు, కార్యకర్తలు, నాయకులపై ఉందని గుర్తు చేశారు. ఒకే పార్టీ, ఒకే వర్గం, ఒకే జెండా అన్న నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగించి, దొంగ ఓట్లను నమోదు చేసుకోవడానికి కుట్ర పన్నుతున్న కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. పార్టీ విజయం కోసం దైర్యంగా పోరాడండి. మీ వెనుక దన్నుగా మేము న్నామని కార్యకర్తలకు భరోసానిచ్చారు.
ఐకమత్యంగా పోరాటం చేద్దాం
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై ఐకమత్యంగా పోరాటం చేద్దామని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవున్నా సంక్షేమం, అభివృద్ధి ఏకోశానా లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా తమిళనాడు తరహాలో కులం, మతం, ప్రాంతం, మద్యం, జాతి, డబ్బులేని ఎన్నికలు రావాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పి పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ప్రతి బూత్ ఏజెంట్ అప్రమత్తంగా ఉండి తమ పరిధిలోని వైఎస్సార్ సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించకుండా చూడాలన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసే కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు.
జగనన్న సైనికులను తయారు చేయండి
ప్రతి గ్రామంలోనూ జగనన్న సైనికులను తయారు చేసే బాధ్యత ప్రతి నాయకుడిపైనా ఉందని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప తెలిపారు. పేదలకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. చంద్రబాబు జగనన్న పథకాలకు పేర్లు మార్చి తూతూమంత్రంగా అమలుచేస్తున్నారని విమర్శించారు. కూటమి నాయకులు ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ కార్యాలయాలుగా మార్చేశారని ఆరోపించారు.


