యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు

May 31 2026 2:00 AM | Updated on May 31 2026 2:00 AM

● బంగారుపాళ్యం చంద్రశేఖర్‌పురంలో మరోసారి వెలుగులోకి దందా ● తమిళనాడు, కర్ణాటక గర్భిణులే టార్గెట్‌ ● ఏజెంట్లుగా ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు

బంగారుపాళ్యం/కాణిపాకం: కడుపులో ఉన్న శిశు వు ఆడామగా.. తెలుసుకోవాలన్న ప్రజల ఆసక్తిని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నా రెచ్చిపోతున్నారు. శనివారం బంగారుపాళ్యం మండలం చంద్రశేఖర్‌పురంలో పోలీసులు దాడి చేసి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకోవడంతో గతంలో పట్టుబడిన ముఠా లే మళ్లీ దందా చేస్తున్నాయేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తమిళనాడు గర్భిణులే టార్గెట్‌

చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం కావడంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన గర్భిణు లు ఈ ముఠాలకు ప్రధాన ఆదాయ వనరుగా మా రినట్లు తెలుస్తోంది. మొదట్లో తమిళనాడు జిల్లాల నుంచి గర్భిణులను రప్పించి అక్రమ లింగ నిర్ధారణ చేయించేవారు. రానురాను కర్ణాటక, చిత్తూ రు జిల్లాకు చెందిన మహిళలను కూడా టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో స్థానికంగా ఏజెంట్ల నెట్‌వర్క్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. గ్రామాల్లో గర్భిణుల వివరాలను సేకరించి ముఠాకు చేరవేయడం, తర్వాత వారిని ఒప్పించి పరీక్షలకు తీసుకెళుతు న్నట్టు సమాచారం. గత ఏడాది మే నెలలో చిత్తూరులోని లక్ష్మీనగర్‌లో అక్రమ లింగ నిర్ధారణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక దాడులతో బట్టబయలు చేశారు. ఆ సమయంలో కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ముఠా సభ్యులు మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

తిరుపతి ఘటనతో బయటపడిన గుట్టు

తిరువణ్ణామలై జిల్లాకు చెందిన ఒక గర్భిణికి తిరుపతిలో స్కానింగ్‌ చేసి కడుపులో ఆడబిడ్డ ఉందని చెప్పడంతో ఆమె అబార్షన్‌కు సిద్ధపడింది. దీనిపై కుటుంబంలో తీవ్ర వివాదం చోటుచేసుకోవడంతో ఆమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ కేసు విచారణ ద్వారా తిరుపతిలో కొనసాగుతున్న అక్రమ లింగ నిర్ధారణ నెట్‌వర్క్‌ బయటపడింది. ఇక గర్భిణి మృతికి కారకులైన ముఠాను తమిళనాడు పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

తాజాగా బంగారుపాళ్యంలో...

బంగారుపాళ్యం మండలం చంద్రశేఖర్‌పురంలో వెలుగులోకి వచ్చిన ఘటనతో అదే ముఠా ఈ వ్యవహారాన్ని గుట్టుగా సాగిస్తున్నట్టు అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, అసలు సూత్రధారులు ఎవరు? వారికి సహకరిస్తున్న వారు? స్కానింగ్‌ మిషన్లు ఎక్కడ కొనుగోలు చేశారు..? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది.

ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలేవీ?

వైద్యశాఖ వర్గాల సమాచారం ప్రకారం గతంలో వెలుగులోకి వచ్చిన కేసుల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. వారిపై చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అందువల్లే ముఠాలకు ధైర్యం వచ్చిందన్న విమర్శలు న్నాయి. అక్రమ లింగ నిర్ధారణ కేసుల్లో స్కానింగ్‌ చేసే వారిపైనే కాకుండా గర్భిణులను తీసుకొచ్చి న ఏజెంట్లు, సహకరించిన వారు, కుటుంబ సభ్యులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

పోలీసుల అదుపులో లింగనిర్ధారణ పరీక్షల ముఠా

బంగారుపాళెం: అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ గర్భిణులు ఒక్కొక్కరి నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు శనివారం పట్టుకున్నారు. బంగారుపాళెం మండలంలోని మారుమూల గ్రామమైన చంద్రశేఖరపురంలో అక్రమ లింగనిర్ధారణ పరీక్షలు గత మూడు వారాలుగా చేస్తున్నట్టు సమాచారం. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వారానికి ఒక్కసారి గర్భనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు శనివారం ఎస్‌ఆర్‌పురం నుంచి ఒకరు, తమిళనాడు నుంచి 12 మంది, కర్ణాటక నుంచి ఇద్దరు గర్భిణులు వచ్చినట్లు తెలిసింది. పోలీసులు నిఘా పెట్టి ఐదుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో గర్భిణి నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. డాక్టర్లు, సిబ్బంది కొంతమంది ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా గర్భిణులను తీసుకువచ్చి అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement