ప్రయాణికుల భద్రతే జన విశ్వాస్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల భద్రతే జన విశ్వాస్‌ లక్ష్యం

May 31 2026 2:00 AM | Updated on May 31 2026 2:00 AM

– ఎస్పీ తుషార్‌ డూడి

నగరి : ప్రజల భద్రత, మహిళల రక్షణ, నేరాల నివారణలో భాగంగా చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘‘జన విశ్వాస్‌ – సురక్షిత త్రిచక్ర వాహన ప్రయాణాలు అనే వినూత్న కార్యక్రమాన్ని శనివారం నగరి పట్టణంలో శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీ, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌, శిక్షణా ఐపీఎస్‌ తరుణ్‌పహ్వాతో కలిసి ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆటోలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య, క్యూర్‌ కోడ్‌ కలిగిన స్టిక్కర్లను అతికించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్ర తే పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని ప్రతి ఆటోను ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చి, అవసరమైనప్పుడు వివరాలను తక్షణమే గుర్తించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఆటో, డ్రైవర్‌, యజమాని, వాహనం వివరాలు తెలుస్తాయన్నారు. తద్వారా ప్రయాణికులకు భద్రత పెరగడంతో పాటు, నేరాల నియంత్రణ, ట్రాఫిక్‌ నిర్వహణ అందించడం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రవికుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజీనాయక్‌, ఎంపీడీవో వాణి, సీఐ మల్లికార్జునరావ్‌ తదితరులు పాల్గొన్నారు.

రేపు దగా డీఎస్సీపై నిరసన

చిత్తూరు కార్పొరేషన్‌: రాష్ట్రంలోని నిరుద్యోగులను ప్రభుత్వం డీఎస్సీ పేరుతో దగా చేసిందని, ఇందుకు వ్యతిరేకంగా సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు వైఎస్సార్‌ సీపీ చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు మనోజ్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. సోమవారం ఉదయం 9 గంటలకు నిరుద్యోగులతోపాటు డీఎస్సీ అభ్యర్థులందరూ అమూల్‌ డెయిరీ వద్దకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమానికి యువత రీజనల్‌ కోఆర్డినేటర్‌ హేమంత్‌రెడ్డితో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల యువత అధ్యక్షులు, యువత హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. డెయిరీ నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకుని అక్కడ నిరసన తెలియజేస్తామని వివరించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతూ మోసం చేస్తున్న తీరుపై ఉద్యమిస్తున్నామన్నారు. డీఎస్సీ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. అవినీతి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement