హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు

May 31 2026 1:54 AM | Updated on May 31 2026 1:54 AM

పుత్తూరు : మండలంలోని చిన్నరాజుకుప్పుం వద్ద ఈ నెల 28న టీడీపీ నాయకుడు వై.ప్రసాద్‌నాయుడి(56) పై హత్యాయత్నం చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్టు ఎస్‌ఐ నాగేంద్రబాబు తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ చిన్నరాజుకుప్పానికి చెందిన ప్రసాద్‌నాయుడు గత గురువా రం ఉదయం 7.40 గంటల ప్రాంతంలో గంగాధరం ప్లాట్స్‌ వద్ద వాకింగ్‌ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బైక్‌పై కూర్చున్నాడని తెలిపారు. అదే సమయంలో చిన్నరాజుకుప్పానికి చెందిన పి.రాజేంద్ర(38), పి.రవి(36), పి.సంతోష్‌(20), పి.నరేష్‌(39) ఆటోలో వచ్చి బైక్‌ను ఢీకొట్టారని తెలిపారు. కిందపడిపోయిన ప్రసాద్‌నాయుడిపై రాజేంద్ర కత్తితో దాడి చేశాడన్నా రు. మిగిలిన ముగ్గురు ప్రసాద్‌నాయుడిని పైకి లేవనీయకుండా కాళ్లతో తన్నుతూ నిన్ను చంపకుండా వదలిపెట్టమంటూ బెదిరించారని తెలిపారు. ఈ క్రమంలో బాధితుడి కేకలు విన్న సమీపంలోని వ్యక్తులు అక్కడికి రావడంతో నిందితులు ఆటోలో పరారయ్యారని తెలిపారు. పాత కక్షలతోనే తన భర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితుడి భార్య ఆర్‌.సరళాదేవి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితులు శనివారం వడమాలపేట మండలం అబ్బికండ్రిగ గ్రామంలోని మామిడి తోట వద్ద ఉండగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement