ఐరాల: మండలంలోని బొమ్మసముద్రం బ్రిడ్జి సమీపంలోని తిరుపతి– బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం బైక్ అదుపుతప్పి ఇనుప సైన్ బోర్డును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. కాణిపాకం పోలీసుల కథనం మేరకు.. పూతలపట్టు మండలం ఎగువ పాలకూరు దళితవాడకు చెందిన టీ.సుధ(38) కుమారుడు అనారోగ్యంతో బాధపడుతూ చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని చూడడానికి సుధ శుక్రవారం ఉదయం బీ.హేమాద్రి అలియాస్ చంటి(22)తో కలిసి ద్విచక్ర వాహనంలో చిత్తూరు బయలుదేరారు. బొమ్మసముద్రం బ్రిడ్జి సమీపంలోని తిరుపతి– బెంగళూరు జాతీయ రహదారిపై ద్విచక్రవాహ నం అదుపుతప్పి ఇనుప సైన్ బోర్డును బలంగా ఢీకొంది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. హేమాద్రి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సుధను 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె కూడా మృతి చెందింది. మృతుడి తండ్రి శివాజీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
ఎగువ పాలకూర దళితవాడలో విషాదం
పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను పోలీసులు బంధువులకు అప్పగించారు. మృతదేహాలు ఇళ్లకు చేరుకోగానే ఎగువ పాలకూరు దళితవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. మా ఇంటి దీపాలు ఆరిపోయాయి. మేం ఎవరి కోసం బతకాలి అంటూ హేమాద్రి తల్లిదండ్రులు శివాజీ, కమలమ్మ, సుధ భర్త మహేష్, కుమారుడు, కుమార్తె కన్నీరుమున్నీరయ్యారు. వారిని చూసి అక్కడినున్న వారు కంటతడి పెట్టారు. హేమాద్రి, సుధ బంధువులు. శివాజీ, కమలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు హేమాద్రి. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. చేతికి వచ్చిన కొడుకు 22 ఏళ్లకే మృతిచెందడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. దేవుడా మాకు ఎందుకు ఈ శిక్ష వేశావు.. అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరుకు అక్కడివారు చల్లించిపోయారు.
సుధ (ఫైల్)
హేమాద్రి (ఫైల్)


