బెల్టు తీసేదెన్నడో..? | - | Sakshi
Sakshi News home page

బెల్టు తీసేదెన్నడో..?

May 30 2026 12:17 AM | Updated on May 30 2026 12:17 AM

సందుకో అమ్మకాల కేంద్రం

మద్యం మత్తులో ఊగుతున్న పల్లెలు

తూతూమంత్రంగా పోలీసుల దాడులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చిత్తూరు మండలంలో ప్రతి గ్రామంలోనూ సందుకో మద్యం బెల్టు షాపు ఉంది. మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతుండడంతో పల్లెల్లో ప్రశాంతత కరువవుతోందని స్థానికులు వాపోతున్నారు. ఉదయం మొదలైన అమ్మకాలు అర్ధరాత్రి దాటినా ఆగడం లేదని చెబుతున్నారు. కూలి పనికి వెళ్లే యువకుల నుంచి మధ్య వయస్కుల వరకు మద్యం బారిన పడుతుండడంతో కుటుంబాలు కుదేలవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుమ్మింద గ్రామంలో మూడు బెల్టు షాపులపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. తాళంబేడు క్రాస్‌లో రెండు షాపులపై ఇటీవల చర్యలు తీసుకున్నారు. దాడులు జరిగిన చోట్లే మరిన్ని షాపులు తెరుచుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు. కొందరు బెల్టుషాపుల నిర్వాహకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిర్భయంగా వ్యాపారం సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గ్రామాలన్నీ మద్యం కేంద్రాలే..

తుమ్మిందతో పాటు తాళంబేడు క్రాస్‌, బంగారెడ్డిపల్లి, గువ్వకల్లు, నల్లవెంకటయ్యగారిపల్లి, ముత్తుకూరు, తాళంబేడు, శెట్టిగారిపల్లి తదితర గ్రామాల్లో బెల్టుషాపులు బహిరంగంగానే కొనసాగుతున్నాయి. పూతలపట్టు, యాదమరి, బంగారుపాళ్యం, ఐరాల మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో చిన్న చిన్న గుడిసెలు, కిరాణా దుకాణాలు, టీ షాపుల వెనుక భాగాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఇళ్ల నుంచే బెల్టు వ్యాపారం నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు.

యువత భవిష్యత్తు అంధకారంలోకి..

సాయంత్రం అయ్యిందంటే చాలామంది యువకులు బెల్టుషాపుల వద్ద గుమిగూడుతున్న దృశ్యాలు గ్రామాల్లో సాధారణంగా మారిపోయాయి. రోజువారీ కూలి పనులు చేసుకునే వారు తమ సంపాదనలో అధిక మొత్తం మద్యానికే ఖర్చు చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తు లో గొడవలు, కుటుంబ కలహాలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని గ్రామ పెద్దలు చెబుతున్నారు. కొన్నిచోట్ల మహిళలు రాత్రిళ్లు బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితి ఉందని అంటున్నారు. గ్రామాల్లో బహిరంగంగానే మద్యం విక్రయాలు జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

గ్రామాల్లో కిరాణా షాపులేమోగాని బెల్టు షాపులు మాత్రం రాత్రంతా తెరిచే ఉంటున్నాయి. అక్రమార్కులు అధికారం అండతో యథేచ్చగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. అక్రమ మద్యం విక్రయాలపై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. అధికారిక మద్యం దుకాణాల కంటే బెల్టుషాపులే ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.

గ్రామాల్లో విచ్చలవిడిగా

బెల్టుషాపులు

Advertisement
 
Advertisement
Advertisement