చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో మాతా–శిశు మరణాల నివారణకు అన్ని శాఖ ల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగశశిభూషణ్‌రెడ్డి ఆదేశించారు. ఆయన శుక్రవారం మాతాశిశు మరణాలపై జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న రెండు మాతృ మరణాలు, 11 శిశు మరణాలపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ గర్భిణులు ఆస్పత్రుల్లోనే ప్రసవం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రెఫరల్ కేసులను ఆలస్యం చేయకుండా ఉన్నత ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు. హైరిస్క్ గర్భిణులను సీ్త్ర వ్యాధి నిపుణుల పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు. సమస్యలు ఉన్న గర్భిణులను సమీప ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి తగిన వైద్యసేవలు అందించాలన్నారు. సాధారణ కాన్పులకే ప్రాధాన్యత ఇవ్వాలని, మూఢనమ్మకాలు, ముహూర్తాల పేరుతో అనవసర సిజేరియన్లు చేయరాదని స్పష్టం చేశారు. గర్భధారణ సమయంలో పౌష్టికాహారం, వైద్య పర్యవేక్షణ, తగిన జాగ్రత్తలు పాటిస్తే శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ పద్మాంజలిదేవి, ఎంసీహెచ్ నోడల్ అధికారి డాక్టర్ హనుమంతరావు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ, పీహెచ్‌సీల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.


