టెండర్ల నుంచి దర్శనాల వరకు అతనిదే హవా అంతర్గత బదిలీలు, కీలక పోస్టింగుల్లోనూ తనదైన ముద్ర ఒక వర్గానికి ప్రాధాన్యత.. మిగిలిన వారిపై వేటు..? ఆ అధికారిపై భగ్గుమంటున్న సొంత పార్టీ నేతలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఓ ద్వితీయశ్రేణి అధికారి పెత్తనం పెచ్చుమీరింది. ఉన్నతాధికారులను కాదని అన్నింటా రవితేజమై ప్రకాశిస్తున్నారు. ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ అసలు నిర్ణయాధికారం మాత్రం ఆ అధికారిదేనన్న అభిప్రాయం ఉద్యోగులు, రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏళ్ల తరబడి అదే స్థానంలో కొనసాగుతున్న ఆ అధికారి ఆలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పరచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల నియామకాలు, అంతర్గత బదిలీలు, కీలక బాధ్యతల కేటాయింపు, టెండర్లు, దర్శనాల ప్రాధాన్యతలు, కాంట్రాక్టుల ఎంపిక.. ఇలా ఏ ఫైలు అయినా అతని అనుమతి లేకుండా ముందుకు కదలదన్న చర్చ సాగుతోంది. సిఫార్సులు లేకుండా పనులు దక్కడం కష్టమైందని కొంతమంది కాంట్రాక్టర్లు వాపోతున్నట్లు సమాచారం. ఆలయంలోని చిన్నపాటి సరఫరాల నుంచి పెద్ద కాంట్రాక్టుల వరకు ఒక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పర్యవేక్షకులకు ‘పవర్ కట్’..?
ఆలయంలో విధులు నిర్వహించే పర్యవేక్షకుల అధికారాలను తగ్గించారని కొందరు వాపోతున్నారు. ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఆ అధికారినే సంప్రదించాల్సిన పరి స్థితి ఏర్పడిందని మదనపడుతున్నా రు. దీంతో స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నామని అంటున్నారు. తద్వారా పరిపాలనలో సమన్వయం దెబ్బతింటోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయంలో ఉన్న ఓ ఉన్నతాధికారిని నామమాత్రంగా చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజకీయ వేడి
ఆలయ వ్యవహారాల్లో కూటమిలోని ఒక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలనే పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా పాతుకు పోయిన ఆ అధికారిని వెంటనే వేరేచోటికి బదిలీ చేయాలని కొంతమంది నేతలు రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఆలయ పరిపాలనలో జరుగుతున్న పరిణామాలపై సమగ్ర విచారణ జరిపించాలని కూటమిలోని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు.
జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి జిల్లాలో పలువురు నాన్ టీచింగ్ సిబ్బంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10 శాతం కోటాలో జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్ పొందారు. వారిలో రాధిక ప్రియా, భువనేశ్వరి, వెంకటరమణ నాయక్, రియాజ్‌లు ఉన్నారు. వీరిని నాన్‌టీచింగ్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి అభినందించారు. ప్రమోషన్ ఇచ్చిన ఇంటర్ బోర్డు కమిషనర్ రంజిత్‌బాషా, ఆర్జేడీ సురేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
పెత్తనం చెలాయిస్తున్న ద్వితీయశ్రేణి అధికారి?
బదిలీల్లోనూ హవా..?
ఆలయ సిబ్బందిలో అంతర్గత బదిలీలు, స్థానచలనాల్లో కూడా ఆ అధికారిదే చివరి మాటగా మారిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తనకు అనుకూలంగా పనిచేసే వారిని కీలక స్థానాల్లో ఉంచుతూ, విభేదించే వారిని ప్రాధాన్యతలేని విభాగాలకు పంపిస్తున్నారనే అసంతృప్తి పెరుగుతోంది. ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులకు మంచి పోస్టింగులు, దర్శన విభాగాలు, ఆదాయ వనరులు ఉన్న బాధ్యతలు అప్పగిస్తున్నారన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది.


