●
మెగా డీఎస్సీ పేరుతో
కుచ్చుటోపీ
చిత్తూరు కలెక్టరేట్/చిత్తూరు కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం డీఎస్సీపై తొలి సంతకం అంటూ అంతులేని అక్రమాలకు పాల్పడిందని, మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను నట్టేట ముంచిందని వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు శశిదీప్, నియోజకవర్గ అధ్యక్షుడు సద్దాం మండిపడ్డారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రమైన చిత్తూరులోని దర్గా సర్కిల్‌లో వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. శశిదీప్, సద్దాం మాట్లాడుతూ.. ఇది మెగా డీఎస్సీ కాదని, లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసిన దగా డీఎస్సీ అని మండిపడ్డారు. డీఎస్సీ–2025లో మెరిట్ జాబితాను విడుదల చేయకుండా ప్రభుత్వం ఎందుకు దాస్తోందని ప్రశ్నించారు. ఉపాధ్యాయ పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నారనే ఆడియోలు, ఆరోపణలు స్పష్టంగా వినబడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. సీఎం బంధువునని చెప్పుకుంటూ పోస్టులను సంతలో సరుకులా అమ్మే సిన మాస్టర్ మైండ్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న చినబాబు (లోకేష్) వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులా?..
అక్రమాలపై సోషల్ మీడియాలో ప్రశ్నించినా, పత్రికల్లో రాసినా క్రిమినల్ కేసులు పెడతామని విద్యాశా ఖ బెదిరించడం అత్యంత హేయమన్నారు. ఎస్సీఈఆర్‌టీ నుంచే ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని, కృష్ణా జిల్లా టాపర్ వివరాలను రాత్రికి రాత్రే డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారని నిలదీశారు. అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వం లెక్కచేయలేదని ధ్వజమెత్తారు. డీఎస్సీ బాధితుడు ఏకాంబరం మాట్లాడుతూ మైదానంలో అడుగు పెట్టని వాళ్లకు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టులు ఇచ్చేశారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో దాదాపు నాలుగింట మూడొంతుల పోస్టులను భారీగా అమ్ముకున్నట్టు తెలుస్తోందని తెలిపారు. దీనిపై ఆర్టీఐ కింద సమాచారం అడిగినా ఇవ్వకుండా తొక్కి పెడుతున్నారని చెప్పారు. ఈ స్కామ్‌పై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు జెస్టిన్, సంతోష్, ప్రతాప్, నిర్మల, అంజలి, అమ్ము, అజిత్ పాల్గొన్నారు.
ఎస్‌ఎంఎస్‌లతో మాయాజాలం
ఏ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షకై నా తుది ఫలితాల తర్వాత పూర్తి మెరిట్ లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో పెట్టడం ఆనవాయితీ. ఈ డీఎస్సీలో లిస్టును మాయం చేశారు. 3.36 లక్షల మంది పరీక్ష రాశారు. ఎంపికయ్యావు అంటూ కొందరికి సీక్రెట్‌గా ఎస్‌ఎంఎస్‌లు పంపారు. సెలెక్టెడ్ అని మెసేజ్ వచ్చిన తర్వాత కూడా మార్కులు మార్చేయడం, డేటా డిలీట్ చేయడం చూస్తుంటే లోపల ఎంత పెద్ద కుంభకోణం జరిగిందో అర్థమవుతోంది. నిరుద్యోగుల జీవితాలతో ఇంత దారుణంగా ఆడుకుంటారా? బాధితులకు కచ్చితంగా న్యాయం చేసి తీరాలి.
– శశిదీప్, జిల్లా ఉపాధ్యక్షుడు,
వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం
హైకోర్టు ఆదేశాలనూ లెక్కచేయరా..?
కూటమి ప్రభుత్వ అవినీతి వల్ల దాదాపు 4 వేల మంది అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారు. దీనిపై 200 మందికి పైగా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం చేసినది దుర్మార్గమైన చర్య అని కోర్టు వ్యాఖ్యానించింది. అర్హులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని అధికారులు పట్టించుకోవడం లేదు. కేసులు విత్‌డ్రా చేసుకోవాలని అభ్యర్థులను బెదిరిస్తున్నారు. కోర్టులంటే కూడా ఈ ప్రభుత్వానికి లెక్కలేదా? – ప్రతాప్, విద్యార్థి సంఘ నాయకుడు
రూ.15 లక్షలు ఇస్తేనే ఉద్యోగమా? కష్టానికి విలువ లేదా..?
ఎవరితోనూ చెప్పొద్దు.. సీక్రెట్‌గా రండి అంటూ ఉపాధ్యాయ పోస్టులను రూ.15 లక్షలకు బేరసారాలు చేసుకున్న ఆడియోలు రాష్ట్రమంతా వినబడుతున్నాయి. ఒక్కో పోస్టుకు రేటు కట్టి సంతలో సరుకులా అమ్మేస్తుంటే, కోచింగ్ సెంటర్లలో రూ.వేలు ఖర్చు పెట్టి చదువుకున్న పేద నిరుద్యోగులు ఏమైపోవాలి? సీఎం బంధువులమని చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ మాస్టర్ మైండ్స్‌ని ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. – జెస్టిన్, విద్యార్థి సంఘ నాయకుడు
ప్రశ్నపత్రాల తయారీదారుడే టాపర్ అవ్వడం విచిత్రం!
ఎస్సీఈఆర్టీ డిజిటల్ విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ, ప్రశ్నపత్రాల తయారీ, అప్‌లోడ్ ప్రక్రియలో పాల్గొన్న వ్యక్తే ఈ పరీక్షలో కృష్ణా జిల్లా టాపర్‌గా, జోన్–2 టీజీటీలో ర్యాంకర్‌గా నిలవడం అత్యంత దారుణం. నిబంధనలను ఉల్లంఘించి పరీక్ష రాసే వ్యక్తికి ఆ బాధ్యతలు ఎలా ఇచ్చారు? అవినీతి బయటపడగానే రాత్రికి రాత్రే ఆ డేటాను ఎందుకు డిలీట్ చేశారు? పారదర్శకత అంటే ఇదేనా చంద్రబాబు గారూ? – సంతోష్, విద్యార్థి సంఘ నాయకుడు


