కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశా రు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రవి, చిత్తూరు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
మహిళల భద్రతకు
‘ఆపరేషన్ దండాయన’
చిత్తూరు అర్బన్: జిల్లా వ్యాప్తంగా మహిళలు, బాలికల భద్రత కోసం ‘‘ఆపరేషన్ దండాయన’’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఆయన శుక్రవారం చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా త్వరితగతిన శిక్షలు పడేలా చూస్తామన్నారు. పునరావృత నేరస్తులపై ‘‘సెక్సువల్ అఫెండర్ షీట్లు‘ తెరుస్తామని, జియో ట్యాగింగ్, నైబర్‌హుడ్ వాచ్ విధానాల ద్వారా నిఘా పెడతామని చెప్పారు. ఇప్పటికే 16 కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బాధితులకు కౌన్సెలింగ్, ఉచిత న్యాయ సహాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు. మహిళల రక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
టెట్‌పై పార్లమెంట్‌లో
సవరణ చేయాలి
చిత్తూరు కలెక్టరేట్: ప్రభుత్వ ఉపాధ్యాయలకు టెట్ మినహాయింపుపై పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసెడెంట్ రెడ్డిశేఖర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లు మూడేళ్లలోపు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరిని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం టెట్ మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చిందని, దాన్ని ఇప్పుడు విస్మరించిందని మండిపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పుతో ఉపాధ్యాయుల్లో ఆందోళనలో పడ్డారని వెల్లడించారు. పిల్లలకు పాఠాలు చెప్పాలా? లేక పరీక్షకు సిద్ధమవ్వాలా అన్న సందిగ్ధంలో పడ్డారని తెలిపారు. అంతేగాక టెట్ ఉత్తీర్ణులు కాని వారికి పదోన్నతులు లభించవని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయడానికి చొరవ చూపాలని కోరారు.


