మహానాడు కాదు.. దగానాడు | - | Sakshi
Sakshi News home page

మహానాడు కాదు.. దగానాడు

May 30 2026 12:11 AM | Updated on May 30 2026 12:11 AM

టీడీపీ హయాంలోనే దళితులకు తీవ్ర అన్యాయం మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి

పాలసముద్రం : ప్రభుత్వం ప్రజల సొమ్ముతో మహానాడును ఆర్భాటంగా నిర్వహించిందని, అది ప్రజలను మోసం చేయడానికి ఉద్దేశించిన దగానాడు అని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. ఆయన శుక్రవారం పాలసముద్రంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా నిర్వహించిన మహానాడుకు ప్రజల సొమ్మును వినియోగించారని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే మొహం చాటేశారని పేర్కొన్నారు. సభలో నాయకులను కూర్చోబెట్టడానికి రికార్డింగ్‌ డ్యాన్సులు చేయించారని విమర్శించారు. ఈ రెండేళ్లలో ప్రజలకు ఏమి మేలు చేశారో చెప్పకుండా వైఎస్సార్‌ సీపీపై బురదజల్లడానికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయలేదన్నారు. మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు భృతి గురించి చెప్పలేదన్నారు. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క నెలలోనే నాలుగైదు సార్లు పెట్రోల్‌ ధరలను పెంచి పేద ప్రజల నడ్డి విరిచారని పేర్కొన్నారు. రెడ్‌బుక్‌ పేరుతో వైఎస్సార్‌ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు. వీటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే మహానాడు వేదికగా డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు ప్రభుత్వంలోనే దళితులకు దగా

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే హక్కు, అర్హత టీడీపీకి లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రాతినిధ్యం మహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే అప్పు చెల్లించలేదని ఓ దళిత మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తమ మంత్రివర్గంలో ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.60 వేల కోట్ల సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నాడు. టీడీపీ నాయకులు చంద్రబాబు మెప్పుకోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని హితవుపలికారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్బలగన్‌, వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి మదివానన్‌, ఎంపీటీసీ గోవిందరాజ్‌, మాజీ సర్పంచ్‌ అయ్యప్ప, నాయకులు ఆనందన్‌, గోపాల్‌, మాజీ మండల కన్వీనర్‌ సుందరరాజు, మనోహర్‌, ప్రకాష్‌, ప్రేమ్‌కుమార్‌, అరుల్‌, ధనపాల్‌, చల్లయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement