విద్యాపథంలో రాజేంద్ర ప్రస్థానం | - | Sakshi
Sakshi News home page

విద్యాపథంలో రాజేంద్ర ప్రస్థానం

May 29 2026 2:31 AM | Updated on May 29 2026 2:31 AM

బడిబాగు కోసం అహర్నిశల శ్రమ సమర్థ పరిపాలన, చెరగని ముద్ర వివాదరహితంగా విధుల నిర్వహణ 31న చిత్తూరు డీఈవో రాజేంద్రప్రసాద్‌ ఉద్యోగ విరమణ

చిత్తూరు కలెక్టరేట్‌ : సామాన్య ఉపాధ్యాయుడిగా చాక్‌పీస్‌ పట్టి కెరీర్‌ ప్రారంభించిన రాజేంద్రప్రసాద్‌ నిరంతర శ్రమ, నిబద్ధతతో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి డీఈవో స్థాయికి చేరుకున్నారు. డైట్‌ లెక్చరర్‌, ప్రిన్సిపాల్‌గా ఎంతో మంది యువ టీచర్లను తీర్చిదిద్దారు. టీచర్ల బదిలీలు, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు, టీచర్ల సర్వీస్‌ సమస్యల పరిష్కారంలో వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించి ఉన్నతాధికారుల అభినందనలు అందుకున్నారు. జిల్లాలో డీఈవోగా ఆయన పదవీకాలం ఆదర్శవంతంగా సాగింది. పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ టీచర్లకు తగిన దిశా నిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్స్‌ సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. అంతేగాక ఆయన ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విశేష కృషి చేశారు. నిరంతరం తనిఖీలు చేస్తూ మౌలిక వసతుల కల్పనతోపాటు విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. అధికార దర్పం ప్రదర్శించకుండా స్నేహితుడిగా, ఆత్మీయుడిగా టీచర్లతో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. డీఈవో రాజేంద్రప్రసాద్‌ వీడ్కోలు సభ నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 3 గంటలకు జిల్లా పరిషత్‌ సమావేశమందిరంలో డీఈవో ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఆయన జిల్లా అధికారిగా ఉపాధ్యాయులపై ఏనాడు అధికారాన్ని చెలాయించలేదు. జిల్లా విద్యారంగాన్ని సమర్థవంతంగా నడిపించారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేశారు. విధుల్లో అంకితభావం చూపుతూ చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన ప్రస్థానం ముగింపు దశకు చేరుకుంది. డీఈవో కేడర్‌లో సేవలందించిన రాజేంద్రప్రసాద్‌ ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement