● తాడేపల్లె సమావేశంలో జిల్లా నేతలు
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 89,403 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 44,234 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.14 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
ఏర్పేడు: సైన్స్ రంగంలో నూతన ఆష్కరణలు, పరిశోధనలకు ప్రపంచ భాగస్వామ్యాల బలోపేతం ఎంతైనా అవసరమని తిరుపతి ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య అన్నారు. పరిశోధన, స్టార్టప్‌లు, ఆవిష్కరణ, పరిశ్రమ భాగస్వామ్యాలలో భారత్–కెనడా సహకారం మరింత పెంచే వ్యూహాత్మక కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఐసర్, కెనడా దేశం హాలీఫాక్‌సలోని డల్హౌసీ యూనివర్సిటీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి ఐసర్ డైరెక్టర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కెనడాలోని డల్హౌసీ యూనివర్సిటీలో క్రియేటీవ్ డిస్ట్రక్షన్ ల్యాబ్–అట్లాంటిక్ ఆవిష్కరణ సెషన్‌లలో పాల్గొన్నారు. ఐసర్ డైరెక్టర్, డల్హౌసీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నోని మెక్‌డొనాల్డ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తొలి తిరుపతి–డాల్హౌసీ ఇన్నోవేషన్ రీసెర్చ్ రౌండ్ టేబుల్‌ను ప్రారంభించారు. తిరుపతిలోని ట్రినిస్టిట్యూషనల్ గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాంపస్‌పై చర్చించారు. ఏఐ, డిజిటల్ సిస్టమ్‌లు, ఆరోగ్య సాంకేతికతలు, అధునాతన మెటీరియల్స్, వ్యవసాయం, కీలకమైన ఖనిజాలతో భారతదేశం, కెనడా దేశాల సైన్స్ ప్రగతి, నూతన ఆవిష్కరణలకు సరికొత్త అధ్యాయానికి ఈ ఒప్పందం బీజం వేసిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.


