గజగణన ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

గజగణన ప్రారంభం

May 28 2026 1:40 AM | Updated on May 28 2026 1:40 AM

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో బుధవారం నుంచి గజగణన ప్రారంభమైంది. చిత్తూరు ఈస్ట్‌, వెస్ట్‌, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పం రేంజ్‌ల పరిధిలో ఎఫ్‌ఆర్వోల ఆధ్వర్యంలో లెక్కింపు ప్రారంభించారు. మొత్తం 87 బీట్లలో ఎఫ్‌బీఓ, ఏబీఓలు ప్రతి బీట్‌కు 15 కిలోమీటర్ల చొప్పున అటవీ ప్రాంతంలో వెళ్లి పరిశీలించారు. గురువారం ప్రభుత్వ సెలవు దినం కావడంతో శుక్రవారం, శనివారాలు బీట్ల పరిధిలో తిరిగి ఏనుగుల పేడ సేకరించి, నీటి కుంటలు వద్ద ఉన్న వాటి వివరాలు సేకరించనున్నారు. జూన్‌ మొదటి వారంలో వివరాలను ప్రకటించనున్నట్లు డీఎఫ్‌ఓ సుబ్బరాజు వివరించారు.

చిత్తూరు ఏఏస్పీ రాజశేఖర్‌ రాజుకు ప్రమోషన్‌

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు ఏఎస్పీ (ఆపరేషన్స్‌)గా పనిచేస్తున్న ఎస్‌ఆర్‌.రాజశేఖర్‌ రాజు ఉద్యోగోన్నతిపై ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆయనకు ఎస్పీ (నాన్‌–క్యాడర్‌)గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.

బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి

చిత్తూరు అర్బన్‌: జిల్లాలోని ముస్లింలు బక్రీద్‌ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని చిత్తూరు ఎస్పీ తుషార్‌ డూడీ తెలిపారు. ఎక్కడా ఆవులు, దూడలను వధించవద్దని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే డయల్‌ 112, పోలీసు వాట్సాప్‌ 9440900006 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

కేజీబీవీల్లో ఉద్యోగాల భర్తీ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని కేజీబీవీల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని కేజీబీవీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 5 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌ 1, సీఆర్‌టీ ఫిజికల్‌ సైన్స్‌ 2, సీఆర్‌టీ సోషల్‌ 1, పీఈటీ 1 పోస్టులు ఉన్నాయని తెలిపారు. పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, బీఈడీ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. సీఆర్‌టీ పోస్టులకు టెట్‌ తప్పనిసరి అని, పీఈటీ పోస్టుకు టెట్‌ అవసరం లేదన్నారు. అభ్యర్థుల కనిష్ట వయస్సు 18 ఏళ్లు, గరిష్ట వయస్సు 45 ఏళ్లు ఉండాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు (50 ఏళ్ల వరకు) ఉంటుందని, దివ్యాంగులకు 52 ఏళ్ల వరకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. జూన్‌ 5వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌కు దరఖాస్తులు

చిత్తూరు కలెక్టరేట్‌ : కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏటా ప్రతిష్టాత్మకంగా అందజేసే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌ –2027 అవార్డులకు అర్హులైన బాలలు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్‌ పీడీ వెంకటేశ్వరి తెలిపారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడారు. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచే బాలలను ప్రోత్సహించేందుకు ఈ జాతీయ పురస్కారాలు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. ధైర్య సాహసాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు–సంస్కృతి, విజ్ఞానం – సాంకేతికత విభాగాల్లో ప్రతిభ చాటిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బాలలు భారతీయ పౌరులై ఉండాలని, 2026 జూలై 31 నాటికి 5 నుంచి 18 ఏళ్లలోపు ఉండాలని తెలిపారు. అర్హత గల బాలలు స్వయంగా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. అధికారిక పోర్టల్‌ www.award.gov.inలో జూలై 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారంపై విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామ, వార్డు సచివాలయ అధికారులను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement