తహసీల్దార్లు, ఎన్యూమరేటర్లు సమన్వయంతో పనిచేయాలి వలస వెళ్లిన వారి ఇళ్లను మరోసారి తనిఖీ చేయాలి కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో జనగణన ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన బుధవారం పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 89.4 శాతం జనాభా గణన పూర్తయిందని తెలిపారు. కొన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక దృష్టి సారించి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కొన్ని మండలాల్లో 2011 జనాభా లెక్కల సంఖ్యను దాటకపోవడం, జనన మరణాల రేటు ప్రకారం పెరగాల్సిన జనాభా తగ్గడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు నగరాలకు తాళం వేసి ఉన్న ఇళ్లను మరోసారి తనిఖీ చేసి పొరుగువారి ద్వారా పూర్తి వివరాలను సేకరించాలన్నారు. తహసీల్దార్లు తమ లాగిన్లను నిరంతరం పరిశీలిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకోవాలన్నారు.
పరిశ్రమల స్థాపనకు సత్వర అనుమతులు
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన దరఖాస్తులకు సింగిల్ విండో విధానంలో పారదర్శకంగా, అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం సూరిబాబు, జెడ్‌ఎం సుబ్బారావు, ఎల్డీఎం హరీష్ తదితర అధికారులు పాల్గొన్నారు.


