రెండేళ్లు అవుతున్నా ఏర్పాటుకాని భారీ పరిశ్రమలు ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు అల్లాడుతున్న నిరుద్యోగులు
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లా ఇటు తమిళనాడు, అటు కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం. ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తే వస్తువులను వేగంగా రవాణా చేయవచ్చు. కూటమి నేతలు, ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా కక్షసాధింపు చర్యలకు దిగడంతో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు చిన్న పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు రావడం లేదు. ’కొత్త పారిశ్రామిక పాలసీ తెచ్చాం, పెట్టుబడులు పెట్టండి’ అంటూ అధికారులు ఎంత బతిమాలినా ’మాకొద్దు బాబూ’ అంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో కొత్త ఉద్యోగాలు రాకపోవడంతో పాటు ఉన్న ఉద్యోగాలకు కూడా గండం ఏర్పడింది.
ఎంఎస్‌ఎంఈలే అధికం
జిల్లాలో 2019–2020 ఆర్థిక సంవత్సరంలో రూ.129 కోట్లతో 1,682 ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు స్థాపించారు. 9,291 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2020–21లో 2,086 పరిశ్రమలకు రూ.131 కోట్ల పెట్టుబడులు పెట్టగా 9,710 జాబ్స్ వచ్చాయి. 2021–22 సంవత్సరంలో 1,360 పరిశ్రమలను రూ.83.52 కోట్లతో ఏర్పాటు చేయగా 8,648 మందికి ఉపాధి లభించింది. అలాగే 2022–23లో రూ.132.5 కోట్లతో 2,526 పరిశ్రమలను స్థాపించగా 9,263 మందికి ఉద్యోగాలు లభించి వారి జీవన ప్రమాణం మెరుగుపడింది. 2023–24లో 3,062 పరిశ్రమలను రూ.128.57 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేయగా 10,652 మంది ఉద్యోగాలు లభించాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మొదటి రెండేళ్లు కోవిడ్ సంక్షోభం ఏర్పడింది. తర్వాత కూడా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఐదేళ్లలో మొత్తం 10,716 ఎంఎస్‌ఎంఈలను రూ.604.59 కోట్లతో ఏర్పాటుచేయగా 47,564 మందికి ఉద్యోగాలు లభించాయి. కూటమి ప్రభత్వుం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో జిరాక్స్ సెంటర్లు, పంక్చర్ దుకాణాలు, ఆటోలు ఇలా ప్రతి చిన్నచిన్న వ్యాపారాలను పరిశ్రమల పేరుతో ఎంఎస్‌ఎంఈల కింద నమోదు చేశారు. తద్వారా రూ.126 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది.
● పీఎంఈజీపీ పరంగా 2019–2024 మధ్య జిల్లాలో 665 పరిశ్రమలు స్థాపించగా సబ్సిడీ కింద రూ.23.22 కోట్లు వచ్చాయి. 1,597 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరంగా గతంలో 1,720 పరిశ్రమలకు గాను రూ.107.48 కోట్లు ఇన్‌సెంటివ్స్ రూపంలో ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంలో గత రెండేళ్లుగా 243 పరిశ్రమలకు రూ.14 కోట్లు ఇన్‌సెంటివ్స్ మాత్రమే ఇచ్చారు. అలాగే ఇవి కాకుండా గత రెండేళ్లలో రూ.351 కోట్ల పెట్టుబడులు రాగా 435 మందికి ఉద్యోగాలు వచ్చాయి.
‘‘మేము అధికారంలో వస్తే సంపద సృష్టిస్తాం. దాన్ని ప్రజలకు పంచుతాం. మిమ్మల్ని లక్షాధికారులను చేస్తాం. ఇంటింటికీ ఉద్యోగమిస్తాం. అలా కాకుంటే నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తాం’’ అని ఎన్నికల ముందు టీడీపీ నేతలు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి గురించి పట్టించుకోలేదు. జిల్లాలో చిన్న, సూక్ష్మ, భారీ పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంఎస్‌ఎంఈలు తప్ప భారీ స్థాయి పరిశ్రమలు రావడం లేదు.


