చిత్తూరులో చైన్‌ స్నాచింగ్‌ | - | Sakshi
Sakshi News home page

చిత్తూరులో చైన్‌ స్నాచింగ్‌

May 28 2026 1:40 AM | Updated on May 28 2026 1:40 AM

● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలో బుధవారం పట్టపగలే దుండగుడు చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. కట్టమంచిలోని ద్వారకానగర్‌కు చెందిన నిర్మల అనే మహిళ ఇంటి బయట ముగ్గు వేస్తోంది. గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్రవాహనంలో వచ్చి ఆమెను అడ్రస్‌ అడుగుతున్నట్లు నటించాడు. ఆమె ఆలోచిస్తుండగా మెడలో ఉన్న బంగారు చైనును లాక్కుని పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంగారు గొలుసు దాదాపు 40 గ్రాములకు పైగా ఉంటుందని వెల్లడించింది. వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నీట మునిగి వ్యక్తి మృతి

శాంతిపురం: మండలంలో బుధవారం మిత్రులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన వ్యక్తి నీట మునిగి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. అబకలదొడ్డికి చెందిన మురుగేష్‌(38) మరో ఆరుగురు మిత్రులతో కలిసి గ్రామ సమీపంలోని తోపు చెరువుకు ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు ఎంత ప్రయత్నించినా అతన్ని కాపాడలేకపోయారు. పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. మురుగేష్‌ గతంలో ఆర్టీసీలో కండక్టరుగా పనిచేసేవాడు. వ్యక్తిగత కారణాలతో ఉద్యోగం వదులుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రాళ్లబూదుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అడవిలో వృద్ధురాలి

అస్థిపంజరం లభ్యం

యాదమరి: మండలంలోని డీకే చెరువు గ్రామ సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలో ఒక వృద్ధురాలి అస్థిపంజరం లభించింది. పోలీసుల కథనం మేరకు.. గుడ్డివాని చెరువు అటవీ ప్రాంతంలో పాండవుల బండ వద్ద వేప చెట్టు కింద ఎముకలు గూడుతో ఉన్న మానవ అస్థిపంజరాన్ని రాజాపతి అనే స్థానికుడు బుధవారం గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అస్థిపంజరం తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం తాలూకా డీపీపాలెం గ్రామానికి చెందిన మునెమ్మ(90) అనే వృద్ధురాలిదిగా గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు, చేతి గాజుల ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించారు. మతిస్థిమితం సరిగా లేని కారణంగా ఆమె ఇల్లు విడిచి వెళ్లిపోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. వయోభారంతో పాటు నీరు, ఆహారం లేకపోవడంతోనే అడవిలో మృతి చెంది ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎస్‌ఐ ఈశ్వర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తిరుచానూరు ఆలయం వద్ద కుప్పకూలిన భక్తురాలు

చంద్రగిరి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్న భక్తురాలు కుప్పకూలి పడిపోయింది. ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. విజయవాడ భవానీపురానికి చెందిన కృష్ణవేణి(28) కుటుంబ సభ్యులతో కలసి బుధవారం అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి చేరుకున్నారు. దర్శనార్థం 3వ గేటు వద్ద వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలను నిర్వహించిన అధికారులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎండ తీవ్రత అధికమై వడదెబ్బ తగిలి భక్తురాలు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. భక్తురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సుమతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement