12 కేజీల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

12 కేజీల గంజాయి స్వాధీనం

May 28 2026 1:40 AM | Updated on May 28 2026 1:40 AM

● ఇద్దరు నిందితుల అరెస్ట్‌

నగరి : జిల్లాలో గంజాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట గంజాయి వ్యాపారం జరుగుతూనే ఉంది. అక్రమా ర్కులు తెలివిగా గంజాయిని తరలిస్తున్నారు. తాజాగా ఓజీకుప్పం వద్ద బంధువుల ఇంటికి వెళ్లి బ్యాగులో దుస్తులు తీసుకుని వస్తున్నట్టు అనుమానం రాకుండా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ మల్లికార్జున రావు కథనం మేరకు.. జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ ఆదేశాలతో పోలీసులు బుధవారం ఓజీకుప్పం మారెమ్మ ఆలయం వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బైక్‌లో వచ్చిన ఇద్దరు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగు లో పరిశీలించగా 12 కేజీల గంజాయి ప్యాకెట్లు లభించాయి. విచారణలో వారు ఓజీ కుప్పానికి చెందిన హనుమంతు (46), ఊర్మిళ (26)గా తేలింది. వారు బంధువులు. వారు బైక్‌లో బంధువుల ఇంటికి వెళ్లి దుస్తులు తీసుకువస్తున్నట్టు బ్యాగు పట్టుకు వస్తారు. వీరిని చూస్తే ఎవరికీ సందేహం రాదు. హనుమంతుకు ఊర్మిళ అన్న కుమార్తె కావడంతో ఎవరికీ వేరే ఆలోచన రాదు. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి రవాణా చేస్తున్నారు. వీరి వ్యవహారంపై సందేహం వచ్చిన పోలీసులు కాపుకాశారు. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారు రేణిగుంటలోని గుర్తుతెలియని వ్యక్తి నుంచి కేజీ గంజాయి రూ.5 వేలకు కొనుగోలు చేసి ఇతరులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ముగ్గురు వ్యక్తులు వీరి నుంచి గంజాయి కోనుగోలుకు సిద్ధంగా ఉన్న విషయం బయటపడింది. ఒక్కో ప్యాకెట్‌ రెండు కేజీలు ఉంటుంది. వారికి కేజీకి రూ.8 వేల ఆదాయం వస్తున్నట్టు తేలింది. నిందితులపై క్రైమ్‌ నెంబరు 44/2026 మేరకు కేసు నమోదుచేశారు. డీటీ మేఘవర్ణం సమక్షంలో వారి నుంచి 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారు ఎవరు, వీరి నుంచి కొనుగోలు చేస్తున్నది ఎవరు, ఎక్కడ విక్రయిస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement