తిరుపతి రూరల్ : మండుతున్న ఎండలతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు టపాకాయల్లా పేలుతున్నాయి. విద్యుత్ వాడకం పెరగడంతో ట్రాన్స్‌ఫార్మర్లపై అధికలోడ్ పడి డీటీఆర్‌లు కాలిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 585 33/11కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్లు అందుబాటులో ఉండగా.. సుమారు 2 లక్షల నుంచి 2.5 లక్షల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారానే నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోకి విద్యుత్ సరఫరా అవుతోంది. ఇటీవల గృహ విద్యుత్ వినియోగదారు లు విద్యుత్ వాడకాన్ని పెంచేశారు. వ్యవసాయానికి కూడా వాడకం పెరిగింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాన్స్‌ఫార్మర్లపై ఒత్తిడి పెరిగి కాలిపోతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. పది రోజుల క్రితం రేణిగుంట వద్దనున్న 220కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి.
వాటితోనే ప్రమాదం
లైఫ్‌టైమ్ పూర్తయిన ట్రాన్స్‌ఫార్మర్లు పేలుడుకు గురవతున్నాయని, వాటివల్ల ప్రమాదం పొంచి ఉందని నిపుణు లు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద సరైన ఎర్తింగ్ లేకపోవడం వల్ల కూడా డీటీఆర్‌లు కాలిపోతున్నాయని సిబ్బంది చెబుతున్నారు.
ఒకే నెలలో 500కుపైగా..!
ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో సుమారు 1,600 విద్యుత్ సబ్ స్టేషన్లు అందుబాటులో ఉండగా 7,38,780 ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి విద్యుత్ సరఫరా అవుతోంది. వేసవి అవసరాల దృష్ట్యా డీటీఆర్‌ల సామర్థ్యం పెంచినప్పటికీ వినియోగదారుల నుంచి ఊహించని రీతిలో వాడకం పెరిగిపోయింది. దీంతో లోడ్ బ్యాలెన్స్ చేయకలేక ట్రాన్స్‌ఫార్మర్లు పేలుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒక నెల వ్యవధిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అధిక లోడ్ కారణంగా 500కు పైగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్) కాలినట్టు పేర్కొంటున్నారు. తిరుపతి జిల్లాలో 220, చిత్తూరు జిల్లాలో 180, అన్నమయ్య జిల్లాలో 110 వరకు కాలిపోయినట్టు సమాచారం. ఇటీవల తిరుపతి రూరల్ మండలం, పెరుమాళ్లపల్లి గ్రామంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మీటర్ బాక్సులు పేలిపోయి మంటలు వ్యాపించాయి.
రేణిగుంట 220కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పేలి భారీగా ఎగసిపడుతున్న మంటలు


