పుత్తూరు: మార్కెట్లో అపోహలను నమ్మి మామిడి రైతులు పక్వానికి రాకముందే కాయలు కోయవద్దని ఇన్‌చార్జి జిల్లా ఉద్యానవన అధికారిణి పి.శివకుమారి విజ్ఞప్తి చేశారు. ఆమె బుధవారం పుత్తూరు మార్కెట్ యార్డ్‌ను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ కాయలను పక్వానికి రాకముందే కోసి మార్కెట్, జ్యూస్ ఫ్యాక్టరీలకు తీసుకెళ్లడం వల్ల ధరలు తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నారు. పక్వానికి వచ్చిన కాయలకే ధరలు స్థిరంగా ఉంటాయన్నారు. ఉద్దేశపూర్వకంగా ధరలు తగ్గించి కొలుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మండీ యజమానులను హెచ్చరించారు.
జ్యూస్ ఫ్యాక్టరీలను తెరిపించాలని
రైతుల వినతి
పుత్తూరు, నారాయణవనం, వడమాలపేట మండలాల్లో తోతాపూరి కాయలు పక్వానికి వచ్చాయని, జ్యూస్ ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలని రైతులు శివకుమారిని కోరారు. అకాల వర్షాలకు నేలరాలిన పంటను కొనుగోలు చేసే విధంగా ఫ్యాక్టరీ యాజమాన్యాలను ఆదేశించాలని కోరారు. మూడు నాలుగు రోజుల్లో అన్ని జ్యూస్ ఫ్యాక్టరీలు తెరుస్తారని, అధైర్యపడవద్దని ఆమె ప్రతిస్పందించారు. కార్యక్రమంలో పుత్తూరు హార్టికల్చర్ ఆఫీసర్ వెంకట సౌజన్య, రైతులు పాల్గొన్నారు.


