వచ్చే వారం 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం విలవిల్లాడుతున్న ప్రజలు
03–04–2026 38
04–04–2026 39
05–04–2026 38
06–04–2026 40
07–04–2026 40
08–04–2026 39
09–04–2026 39
10–04–2026 39
కాణిపాకం: మార్చి ప్రారంభం నుంచి క్రమంగా పెరిగిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లో ఉగ్రరూపం దాల్చాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు మండిపోతుండడంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఉదయం 11 నుంచి 38 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఎండప్రచండమై!
చిత్తూరు జిల్లాలో కర్ణాటక సరిహద్దు మండలాలైన కుప్పం, రామకుప్పం, శాంతిపురం, వి.కోట, పలమనేరు, బైరెడ్డిపల్లి, గంగవరం ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొంత తగ్గింది. బంగారుపాళ్యం, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, యాదమరి ప్రాంతాల్లో పరిస్థితి పర్వాలేదనిపిస్తోంది. అయితే తమిళనాడు సరిహద్దు మండలాలైన గుడిపాల, జీడీనెల్లూరు, కార్వేటినగరం, పాలసముద్రం, నగరి ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. తమిళనాడు నుంచి వచ్చే వేడి గాలులతో ఆ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తిరుపతి జిల్లా వైపు ఉన్న మండలాల్లో కూడా ఎండలు భగభగమంటున్నాయి.
రోడ్లపై శీతలపానీయాల సందడి
ఎండ ధాటికి ప్రజలు శీతలపానీయాలవైపు మొగ్గుచూపుతున్నారు. ప్రధాన రహదారుల వెంట జ్యూస్ దుకాణాలు, కొబ్బరి బొండాలు, నిమ్మరసం, చెరుకు రసం బండ్లు పెరిగాయి. మహిళలు చీర కొంగులు, టవళ్లు, స్కార్ఫ్‌లు కట్టుకుని ఎండను తట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొందరు వ్యాపారులు అధిక ధరలకు నాణ్యత లేని పానీయాలు విక్రయిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జ్వరాల పంజా
ఎండల తీవ్రతతో పాటు జిల్లాలో జ్వర పీడిత కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దగ్గు, జలుబుతో పాటు జ్వరం వారం రోజుల పాటు తగ్గడం లేదని బాధితులు చెబుతున్నారు. చిన్నపిల్లలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. గత 12 రోజుల్లో 7,372 జ్వర పీడిత కేసులు నమోదయ్యాయి. వచ్చే వారం ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జాగ్రత్త సుమా!
ఎండల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తునానరు.
జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావాలంటే జంకుతున్నారు. ముఖ్య కూడళ్లు కర్ఫ్యూను తలపిస్తున్నాయి. వేడి గాలులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉక్కపోత, వేడికి తట్టుకోలేక జనం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలకు పరిమితమవుతున్నారు. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదవుతుండగా, వచ్చే వారం 43 డిగ్రీల వరకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు జ్వర పీడితుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.
జిల్లా కేంద్రంలో ఉష్ణోగ్రత వివరాలు
జిల్లాలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
చల్లటి పానీయాల జోలికెళ్లొద్దు
ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో అక్కడక్కడ కనిపించే చల్లనీ పానియాల జోలికెళుతున్నారు. ఎండ తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చల్లగా ఓ జ్యూస్ ఇవ్వమని అడుగుతున్నారు. ఐస్ ముక్కలు ఎక్కువగా వాడే జ్యూస్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు ఐస్ ముక్కల వాడకం తగ్గించుకుని జ్యూస్ తాగడం మంచింది. మండే ఎండల పట్ల అప్రమత్తంగా ఉండడం శ్రేషస్కరం. – అశోక్‌కుమార్, వైద్యనిపుణులు, చిత్తూరు
తలదాచుకోవడం మేలు
ప్రస్తుత ఎండలు తీవ్రంగా ఉన్నాయి. వచ్చే వారం మరింత ఎక్కువగా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో అన్ని ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేశాం. వడదెబ్బతో వచ్చే వారిని గుర్తించి తక్షణ వైద్య సేవలు అందించాలని ఆదేశాలిచ్చాం. పనివేళల్లో డాక్టర్లు కచ్చితంగా అందుబాటులో ఉండాలని ఆదేశించాం. ప్రజలు కూడా మండే ఎండల దృష్ట్యా తలదాచుకోవడం మేలు. ఈ ఎండల్లో అతిగా తిరగొద్దు.
– నాగశశిభూషణ్‌రెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, చిత్తూరు


