పలమనేరు: టమాట ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండు నెలలుగా రైతులకు కన్నీళ్లు తెప్పించిన టమాట ధరలు శుక్రవారానికి కొంత ఊరటనిచ్చాయి. ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 15 కిలోల బాక్స్ రూ.250 దాకా పలకడంతో సంబరపడ్డారు. పొరుగునే ఉన్న కర్ణాటకలోని వడ్డిపల్లి మార్కెట్‌లో టాప్ సరుకు రూ.300దాకా పెరిగింది. టమాట పండే పలు రాష్ట్రాల్లో కావాల్సిన సరుకు అందుబాటులో ఉండడంతో ధరలు పలకని విషయం తెలిసిందే. ప్రస్తుతం వేసవి కారణంగా పలు చోట్ల తోటలు దెబ్బతినడం, ఎండ కారణంగా కాయల నాణ్యత తగ్గడంతో లోకల్ సరుకు ధరలు పెరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.
ఆశాజనకంగా ధరలు
ఇలా ఉండగా మేనెల నాలుగో వారంలో కోతకొచ్చే తోటలకు ధరలు ఆశాజనంగా ఉంటాయని ఇక్కడి వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి దాకా ఉన్న తోటలు ఈనెల ఆఖరు కల్లా వడిగిపోతాయి. ఆపై కొత్త తోటలు కోతకు రావడంతో డిమాండ్ పెరిగి ధరలు ఆశాజనకంగా ఉంటాయని చెబుతున్నారు.


