సహకార పోరు..!
ఇవీ వారి డిమాండ్లు
సహకార ఉద్యోగుల సమ్మె ఉద్ధృతమవుతోంది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన పోరుబాట తారస్థాయి కి చేరుతోంది. ఇన్నాళ్లు దశలవారీగా నిరసనలు, ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఉద్యోగులు పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. సోమవారం నుంచి విధులను బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి దిగుతున్నారు. డీసీసీబీ ఎదుట నిరసనలకు శ్రీకారం చుట్టనున్నారు. డిమాండ్లు సాధించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తున్నారు.
సొసైటీ కార్యాలయం ఎదుట ధర్నా
చేస్తున్న ఉద్యోగులు (ఫైల్)
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా డీసీసీబీ పరిధిలో 75 వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 350 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారు పడుతున్న ఇబ్బందులను ఏళ్లతరబడి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళుతూనే ఉన్నారు. ఫలితం లేకపోవడంతో డిసెంబర్ 16వ తేదీ నుంచి దశలవారీగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపట్టారు. చిత్తూరు సొసైటీ సంఘం కార్యాలయం, డీసీసీబీ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. విజయవాడలో కూడా గళం విప్పా రు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె బాటపట్టారు. ఇందులో భాగంగా సంఘం కార్యాలయల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సహకార సంఘాల్లో ఉద్యోగులు లేకపోవడంతో రైతులు, ఇతరులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ రుణాలు ఎక్కువ శాతం సహకార సంఘాలే మంజూరు చేస్తుంటాయి. ప్రస్తు తం రైతులు రబీ పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పెట్టుబడి కోసం రుణాలు తీసుకోవడానికి సహకార సంఘాలకు వెళుతున్నారు. అక్కడ ఉద్యోగులు లేక రుణాల మంజూరు ప్రక్రియ నిలిచిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
డీసీసీబీ ఎదుట సమ్మెకు శ్రీకారం
జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాల ఉద్యోగులు సోమవారం చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లిలోని డీసీసీబీ కార్యాలయం ఎదుట ధర్నాకు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం నుంచే సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు పోలీసు శాఖ అనుమతి కోరారు. 300 మందికి పైగా సమ్మెలో పాల్గొనున్నట్టు సంఘం నేతలు వెల్లడించారు. డిమాండ్ల సాధనే లక్ష్యమని తెలియజేశారు. ఇందుకు సహకార ఉన్నతాధికారులు, పోలీసు శాఖ సహకరించాలని కోరారు.


