హిందూ యువతికి పెళ్లి చేసిన ముస్లిం
వి.కోట : తన వద్ద పెరిగిన హిందూ యువతికి హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసి మనసుకు మత బేధం లేదని ఒక ముస్లిం నిరూపించాడు. మండలంలోని చౌడేపల్లిలో హేమలత అనే చిన్నారి తండ్రి మరణించగా తల్లి ఎక్కడికి వెళ్లిపోయింది. దీంతో ఆ చిన్నారిని షాబీనా, అబ్దుల్ బాషా దంపతులు చేరదీసి సొంత కూతురిలా పెంచి పెద్ద చేశారు. తమ శక్తి మేరకు చదివించారు. తగిన హిందూ వరుడిని చూసి ఆదివారం ఒక కల్యాణ మండపంలో హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా వివాహం జరిపించారు. రెండు మతాల పెద్దలు, స్థానికులు, బంధుమిత్రులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మత సామరస్యానికి ఈ వివాహం ఒక ఉదాహరణ అని కొనియాడారు. ఈ వివాహ వేడుక సామాజీక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు షాబీనా, అబ్దుల్ బాషా దంపతులను అభినందిస్తున్నారు.
నేడు డయల్ యువర్ ఎస్‌ఈ
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్య క్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. ప్రజలు ఉద యం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


