నేతన్న వేదన
కేంద్ర బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్లు, రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు చేనేత రంగానికి కేటాయించాలి.
సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి.
ఎన్నికల హామీ మేరకు ఏటా రూ.25 వేల ఆర్థిక సహకారం అందించాలి.
200 యూనిట్ల విద్యుత్ ఉచిత పథకాన్ని వెంటనే అమలు చేయాలి
అర్హతఉన్న నేతన్నలకు చేనేత పెన్షన్ అందించాలి.
సహకార సంఘాలకు ఉన్న రుణాలను రద్దు చేయాలి. చేనేతలకు పావులా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించాలి.
కేంద్ర ప్రభుత్వం (1995) హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టాన్ని కఠినతరం చేసి పకడ్బందీగా అమ లు జరపాలి.
నూలు మిల్లులు కనీసం 30% ప్యాకింగ్ చేయాలనే నిబంధనలను అన్ని మిల్లులకు అమలు చేయాలి.
చేనేతకు వినియోగించే చిలపనూలు, జరీ, పట్టు, రంగులు, రసాయనాలపై (ఆర్టికల్) 43 కు వ్యతిరేకంగా విధించిన జీఎస్టీనీ రద్దు చేయాలి. వాటిని సబ్సిడీపై అందించాలి.
నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన చేనేతలకు రూ. 10 వేలు చొప్పున రెండు నెలలకు ఆర్థిక సాయం అందించాలి.
ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
నేత షెడ్ల నిర్మాణానికి మూడు సెంట్ల భూమి ప్రభుత్వం అందించాలి.
చేనేత సహకార సంఘాల పాలక మండళ్లకు ఎన్నికలు వెంటనే నిర్వహించాలి. హ్యాండ్లూమ్ బోర్డు ను పునరుద్ధరించాలి.
చేనేత కంటూ ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి.
చేయూత లేక చేనేత గర్జన
చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయినా ఆ వృత్తిపైనే.. ఆధారపడి జీవిస్తున్న కార్మికుల జీవితాలు మారడం లేదు. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన చేనేత పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. తరాలుగా వస్తున్న ఈ పరిశ్రమ వేల మంది చేనేత కార్మికులకు జీవనాధారంగా ఉండడంతో పాటు భారతీయ వస్త్ర కళకు ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఇటీవల కాలంలో ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
నగరి : నూలు, రంగులు, జరీ, పట్టు, రసాయనాలు వంటి ముడి సరుకుల ధరలు పెరగడం, చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారం, మార్కెటింగ్, ప్రచారం లేకపోవడం, చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం కావడం.. ఇలా చెప్పుకుంటూ పోతే కారణాలు అనేకం. దీంతో చేనేత వస్త్రాల తయారీకి ఖర్చులు భారీగా పెరగడం, తగిన లాభాలు రావడం లేదు. దీంతో భావితరం సైతం చేనేత వృత్తిలోకి రావడానికి మొగ్గు చూపడం లేదు. ఇలా చేనేతలకు కుటుంబ పోషణ కష్టంగా మారిందని నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటకెక్కిన నేతన్న నేస్తం
జిల్లాలో చేనేతపై ఆధారపడి సుమారు 5 వేల కార్మికులు ఉండగా 15 వేల మంది ఈ వృత్తిపై పరోక్షంగా జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా రూ.24 వేలు అందిస్తూ చేనేత కార్మికులను ఆదుకుంది. ఇలా చిత్తూరు జిల్లాలో 5 వేల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. ప్రభుత్వం మారడంతో నేతన్న నేస్తం అటకెక్కింది. ఇటీవల కాలంలో ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని, రోజుకు ఎనిమిది గంటలు పని చేసినా రూ.300 నుంచి రూ.400 రావడం గగనమవుతుండటతో న్యాయం కోసం పోరాటానికి దిగారు. తమ డిమాండ్ల సాధనకు చేనేత గర్జన అంటూ చలో మంగళగిరి కార్యక్రమాన్ని నేడు నిర్వహిస్తున్నారు.
చేనేత రంగాన్ని ఆదుకోవాలి
చేనేత రంగం ఒడిదొడుకుల మధ్య ముందుకుపోతోంది. బలోపేతం చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందక, ముడి సరుకుల ధరలు పెరిగి చేనేత రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాగే కొనసాగితే చేనేత మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే డిమాండ్ల సాధనకు చేనేతలు రోడ్డెక్కాల్సి వస్తోంది. డిమాండ్లు సాధించాలనే లక్ష్యంతోనే చలో మంగళగిరి చేనేత గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
– ఆకుల వాసు, రాష్ట్ర చేనేత కార్మికుల యూనియన్ అధ్యక్షుడు, తిరుపతి.
చేనేత మనుగడ కోల్పోయే ప్రమాదం
ప్రస్తుతం ఉన్న పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలు చేసుకుని నేత నేసినా రోజుకు రూ.200 నుంచి రూ.300 రావడం లేదు. ధరలు పెరగడమే దీనికి కారణం. ఇదే పరిస్థితి కొనసాగితే చేనేత పరిశ్రమ మనుగడ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే చేనేతకు వినియోగించే చిలపనూలు, జరీ, పట్టు, రంగులు, రసాయనాలపై (ఆర్టికల్) 43కు వ్యతిరేకంగా విధించిన జీఎస్టీనీ రద్దు చేయాలి. వాటిని రాయితీపై అందించాలి.
– జి.షణ్ముగ శర్మ, రాష్ట్ర చేనేత కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి, పెనుమూరు
ప్రధాన డిమాండ్లు ఇవీ
జీఎస్టీని రద్దు చేయాలి
నూలుతో పాటు ఇతర ముడి సరుకులపై కేంద్రం, రాష్ట్రం జీఎస్టీ వసూలు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దీన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఈ పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఎన్నికల హామీ మేరకు ఏటా రూ.25 వేల ఆర్థిక సహకారం అందించాలి. 200 యూనిట్ల విద్యుత్ ఉచిత పథకాన్ని వెంటనే అమలు చేయాలి. మనుగడ సాగించడం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. – కందలబాలాజీ,
చేనేత కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, నగరి
రిబేటును పునరుద్ధరించాలి
చేనేతకు వినియోగించే చిలపనూలు, జరీ, పట్టు, రంగులు, రసాయనాలను సబ్సిడీపై అందించాలి. సొసైటీల దగ్గర కొనుగోలు చేసే వస్త్రాలపై గతంలో 30 శాతం రిబేటు ఇచ్చేవారు. దీన్ని కొన్నేళ్ల కిందట రద్దు చేశారు. అప్పటి నుంచి చేనేత పరిశ్రమ సమస్యలను ఎదుర్కొంటోంది. దీనికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెబుతున్నారే తప్ప దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా ఈ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలి.
– కేవీ కుప్పయ్య శెట్టి,
రాష్ట్ర యూనియన్ గౌరవ అధ్యక్షుడు, నగరి
నేతన్న వేదన
నేతన్న వేదన
నేతన్న వేదన
నేతన్న వేదన
నేతన్న వేదన
నేతన్న వేదన


