చిత్తూరులో తమ్ముళ్ల ఇసుక దందా
ఇసుకను సిమెంటు బస్తాల్లో నింపి తమిళనాడుకు తరలింపు చిత్తూరు, పూతలపట్టు టీడీపీ ఇన్‌చార్జ్‌లే పాత్రధారులు..? స్మగ్లర్లకు టీడీపీ నేతల అండ.. కేసు నమోదులో ఖాకీల జాప్యం
చిత్తూరుకు చెందిన కొందరు టీడీపీ నాయకులు ఇసుక స్మగ్లర్ల అవతారం ఎత్తి పట్టుబడ్డారు. వారి ఆటకట్టించాల్సిన పోలీసులు కేసు నమోదులో తీవ్ర జాప్యం చేశారు. అదేవిధంగా నిషేధిత లాటరీ, పేకాట క్లబ్బులు నడిపిస్తూ నెలకు రూ.లక్షల్లో మామూళ్లు మరిగిన ఓ ‘రక్షణ’ అధికారి ఇసుక స్మగ్లర్లకు దన్నుగా నిలిచి కేసు నమోదు కాకుండా ప్రయత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తిరుపతి, సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు నగర శివారుల్లో మంగళవారం రాత్రి ఒక ఎస్‌ఐ గస్తీ చేపట్టారు. తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉన్న రెండు భారీ లారీలు వేలూరు వైపు వెళుతుండగా తనిఖీ చేశారు. అందులో ఉన్న వ్యక్తులు సిమెంటు బస్తాలను తమిళనాడుకు తీసుకెళుతున్నట్లు రికార్డులు చూపించారు. అనుమానం వచ్చిన ఎస్‌ఐ ఒక బస్తాను ఓపెన్ చేయగా ఇసుక కనిపించింది. ఇసుకను సిమెంటు బస్తాల్లో నింపి తమిళనాడుకు తరలిస్తున్న ట్లు గుర్తించారు. రెండు లారీలను గుడిపాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పూతలపట్టు మండలం వావిల్‌తోట నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను రోజూ తమిళనాడుకు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా తేల్చారు. రోజుకు ఇసుక రవాణాద్వారా రూ.10 లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మురకంబట్టుకు చెందిన టీడీపీ వార్డు నాయకుడు, పూతలపట్టుకు చెందిన మరో పచ్చనేత పాత్రధారులుగా ఉన్నట్టు సమాచారం. వారిని కాపాడడానికి అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేషన్ చైర్మన్ పోలీసులకు ఫోన్లు చేసి ఒత్తిడి పెంచారు. స్మగ్లర్లకు పూతలపట్టు, చిత్తూరుకు చెందిన టీడీపీ పెద్దల నుంచి అభయహస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తమకు ఆదాయం లేకపోవడంతో సొంత పార్టీ నేతలే పోలీసులకు ఫోన్ చేసి లారీలను పట్టించినట్టు సమాచారం.
టీడీపీపై స్వామి భక్తి
ఈ వ్యవహారం నుంచి టీడీపీ స్మగ్లర్లను బయటపడేయడానికి ఓ ‘రక్షణ’ అధికారి తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. యాదమరి, చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు నుంచి నెలసరి మామూళ్లు రూ.లక్షల్లో వసూలు చేస్తున్న ఆ అధికారి స్వామిభక్తి ప్రదర్శించారు. మంగళవారం రాత్రి పట్టుకున్న లారీలను తప్పించడానికి బుధవారం రాత్రి వరకు ప్రయత్నించి అలసిపోయారు. స్మగ్లర్లను వదలొద్దని, కేసు నమోదు చేయాలని ఎస్పీ నుంచి నేరుగా ఆదేశాలు రావడంతో ఆ అధికారి వెనక్కు తగ్గి నామమాత్రపు సెక్షన్లతో కేసు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై చిత్తూరు వెస్ట్ సీఐ శ్రీధర్ నాయుడును వివరణ కోరగా ఇసుక స్మగ్లింగ్ చేస్తూ లారీలు పట్టుబడింది తమ స్టేషన్ లిమిట్స్ కాదని, రాత్రి గస్తీ కావడంతో లారీలను గుడిపాల స్టేషన్‌లో పెట్టామని తెలిపారు. వాటిని తాలూకా స్టేషన్ వారికే అప్పగిస్తామని, ఇందులో తమకు సంబంధంలేదని పేర్కొన్నారు. కేసు నమోదుకు సంబంధించి తాలూకా పోలీసులు నోరు మెదపడంలేదు.


