వీకోట గడ్డ–ఉపాధి అక్రమాలకు అడ్డా!
నిండిన చెరువుల్లో పనుల పేరిట ఘరానా మోసం
పనులు జరగకనే బిల్లులు పెట్టుకున్న వైనం
జేబులు నింపుకున్న అధికార పార్టీ నేతలు
ఉపాధి సిబ్బంది కుమ్ముక్కుతోనే అక్రమాలు
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం ఉపాధి అక్రమాలకు అడ్డాగా మారింది. అక్కడి అధికార పార్టీ నేతలు రూ.లక్షలు కాజేసేందుకు పక్కాగా పథకం వేశారు. ఉపాధి సిబ్బందితో కలిసి కావాల్సినంత దోచుకున్నారు. నీటితో నిండుగా ఉన్న చెరువుల్లో ఉపాధి పనులు చేసినట్టు దొంగ బిల్లులు సృష్టించి కోట్లలో కొట్టేశారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తేగాని అక్రమాలు బయటపడలేదు. జిల్లాలోనే వి.కోట పరువు పోయేలా చేసిన ఘనత అధికార పార్టీకే దక్కింది.
రూ.6 కోట్ల వరకు అవినీతి, అక్రమాలు?
ఈ మండలంలో 18 గ్రామ పంచాయతీలున్నాయి. మూడు నెలల క్రితం ఉపాధి ఏపీవోగా రవికుమార్ విధుల్లో చేరాడు. గతంలో ఉపాధి అక్రమాల్లో దిట్టగా పేరొందిన ఈయన మండలంలో అక్రమాలు ఎలా చేయాలో అక్కడి నాయకులకు సూచించారు. దీంతో ప్రజా ధనాన్ని దోచుకునేందుకు పక్కాగా స్కెచ్ వేశారు. అప్పటికే ఈ మండలంలో హంద్రీ–నీవా జలాల ద్వారా చెరువులన్నీ నిండాయి. వాటిలోనే బినామీ కూలీలు, దొంగ మస్టర్ల ద్వారా ఫిష్ పాండ్స్, ఫారం పాండ్స్ తవ్వినట్టు రికార్డులు సృష్టించారు. వాగులు, వంకల్లో పూడికతీత పనులు చేసినట్టు దొంగ మస్టర్లతో రికార్డులు తయారు చేసి ఆన్‌లైన్‌లో ఎక్కించేశారు. ఇందులో భాగంగా రూ.6 కోట్ల వరకు స్వాహా చేసినట్టు సమాచారం. అధికారుల విచారణలో ఎంత అనేది స్పష్టం కానుంది.
మిగిలిన చెరువుల్లోనూ అక్రమాలు
వీకోట మండలంలోని తోటకనుమ పటాలమ్మ చెరువు, గోనుమాకులపల్లి శ్యామదేవర చెరువు, నాగిరెడ్డిపల్లి చెరువు, కృష్ణాపురం కొడగళ్లు చెరువు, పచ్చారమాకులపల్లి పూలకుంట, మంచినీళ్లకుంట, నాకిరేళ్లకుంట, బేరినాగమ్మ కుంట, జవునిపల్లి, మావత్తూరు, చింతలగుంట, పెద్ద భరిణేపల్లి, ఆదినేపల్లి, ఎస్ బండపల్లి, చింతమాకులపల్లి, బైరుపల్లి, కుంభార్లపల్లి, పాముగానిపల్లి, కొంగాటం, సి.ఎల్లాగరం, ఓగు, మిట్టగుండ్లపల్లి, బోడిగుట్లపల్లి, దొడ్డిపల్లి, చాడేపల్లి చెరువుల్లో నీళ్ల ఉన్నప్పటికీ పలు రకాల పనులు చేసినట్టు దొంగ మస్టర్ల ద్వారా రూ.కోట్లలో కొట్టేశారనే విమర్శలున్నాయి. ఈ మండలంలో గత ఏడాది అక్టోబరు నుంచి గత నెలదాకా జరిగిన ఉపాది పనులపై సమగ్రమైన దర్యాప్తు జరిపితే ఎన్నికోట్ల అక్రమాలు జరిగాయోనన్న విషయం బయటపడనుంది.
జెడ్పీ చైర్మన్ ఫిర్యాదుతో వెలుగులోకి
జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పక్కా ఆధారాలతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన ఆ మండల ఏపీవో, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జేఈలపై వీకోట పీఎస్‌లో కేసు నమోదైంది. వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అంతేగాక విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
పర్సంటేజీలతో పంచుకున్నారు
అక్రమాల ద్వారా వచ్చిన డబ్బులో ఉపాధి ప్రధాన సూత్రధారి అయిన అధికారికి 10 శాతం, కిందిస్థాయి సిబ్బందికి 10 శాతం, బినామీ కూలీలకు 5 శాతం, సహకారం అందించిన కింది స్థాయి ఎఫ్‌ఏలు, మేట్లకు 5 శాతం, మిగిలిన 70 శాతం అధికార పార్టీ నేతలు పప్పు బెల్లాల్లా పంచుకున్నట్టు తెలుస్తోంది.


